ఆ జంప్‌... ఆహా!

21 May, 2020 00:26 IST|Sakshi
అంజూ బాబీ జార్జి

‘ప్రపంచ’ పుటలకెక్కిన అంజూ జార్జి

2003 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం

ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్‌

‘ఆసియా’లోనూ పసిడి పతకాలు

స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్‌ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది.

అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్‌నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్‌ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్‌లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్‌ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది.  

కన్నోడు... కట్టుకున్నోడు...
చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్‌ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్‌ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం.

వరల్డ్‌ ఫైనల్స్‌ చాంపియన్‌....
రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది.  

ఆమె ఘనతలివీ....
ప్రపంచ అథ్లెటిక్స్‌ కంటే ముందే అంజూ మాంచెస్టర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్‌ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్‌ (2005లో), అమ్మాన్‌ (2007లో) ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్‌ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్‌) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది.  

ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం
అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్‌ ఈవెంట్‌ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్‌ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్‌ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది.

నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే  షూస్‌ స్పైక్‌ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్‌ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్‌ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్‌ చేరలేకపోయింది.
            
–సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు