అంకితకు పతకం ఖాయం 

23 Aug, 2018 01:06 IST|Sakshi

భారత నంబర్‌వన్‌ మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా సింగిల్స్‌ సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అంకిత 6–4, 6–1తో చోంగ్‌ యుడిస్‌ వోంగ్‌ (హాంకాంగ్‌)పై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అంకిత–రోహన్‌ బోపన్న జంట 6–4, 6–4తో చోంగ్‌ యుడిస్‌ వోంగ్‌–చున్‌ హున్‌ వోంగ్‌ (హాంకాంగ్‌) ద్వయంపై నెగ్గింది.  

కుస్తీలో నిరాశ 
ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌కు చివరి రోజైన బుధవారం భారత్‌కు పతకం దక్కలేదు. నలుగురు రెజ్లర్లు బరిలోకి దిగినా ఎవరూ పతకం ‘పట్టు’ పట్టలేకపోయారు. గ్రీకో రోమన్‌ విభాగంలో హర్‌ప్రీత్‌ సింగ్‌ కాంస్యం కోల్పోయాడు. 87 కేజీల కాంస్య పతక బౌట్‌లో అతను 3–6తో కుస్తుబయేవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడాడు. మిగతా ముగ్గురు రెజ్లర్లు... గుర్‌ప్రీత్‌ (77 కేజీలు), నవీన్‌ (130 కేజీలు), హర్దీప్‌ (97 కేజీలు) పతకం రౌండ్‌కు అర్హత సాధించేకపోయారు.  

జ్యోతి సురేఖ బృందానికి రెండో ర్యాంక్‌... 
మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ ర్యాంకింగ్‌ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ బృందం 2085 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా రెండో ర్యాంక్‌లో నిలిచింది. మిగతా భారత ఆర్చర్లలో ముస్కాన్‌ (691) 9వ, మధుమిత (689) 11వ, త్రిషా దేబ్‌ (683) 19వ స్థానాల్లో నిలిచారు. తమ ప్రదర్శనతో భారత్‌కు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు బై లభించింది. 

జిమ్నాస్టిక్స్‌లో ఏడో స్థానం 
ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి దాస్, మందిర చౌదరీలతో కూడిన భారత జట్టు 138.050 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గాయం కారణంగా స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్‌కు దూరంగా ఉంది.    

మరిన్ని వార్తలు