అంకిత రైనాకు సింగిల్స్‌ టైటిల్‌

21 Jan, 2019 01:21 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా 2019 సీజన్‌కు టైటిల్‌తో శుభారంభం పలికింది. సింగపూర్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఆమె సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో వెనుదిరిగిన ఆమె... వెంటనే సింగపూర్‌ టోర్నీ బరిలోకి దిగింది. ఫైనల్లో అంకిత 6–3, 6–2తో ప్రపంచ 122 ర్యాంకర్, టాప్‌ సీడ్‌ అరంటా రుస్‌ (నెదర్లాండ్స్‌)ను కంగుతినిపించింది. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి నలుగురు సీడెడ్‌ ప్లేయర్లకు షాకిచ్చింది.

రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్‌ లెస్లీ కెర్కొవ్‌ (నెదర్లాండ్స్‌), ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సబినా షరిపొవా (ఉజ్బెకిస్తాన్‌), క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ కాని పెరిన్‌ (స్విట్జర్లాండ్‌)లను కంగుతినిపించింది. టైటిల్‌ విజయంతో 50 రేటింగ్‌ పాయింట్లు పొందిన 25 ఏళ్ల అంకిత సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 168వ స్థానానికి ఎగబాకనుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు