గురి అదిరింది

28 Feb, 2017 04:47 IST|Sakshi
గురి అదిరింది

జీతూ–హీనా జంటకు స్వర్ణం 
రజతం నెగ్గిన అంకుర్‌ మిట్టల్‌ 
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ


న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మెరిశారు. సొంతగడ్డపై జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ను ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ విభాగంలో భారత స్టార్‌ షూటర్లు జీతూ రాయ్‌–హీనా సిద్ధూ జతగా బరిలోకి దిగారు. ఫైనల్లో జీతూ–హీనా ద్వయం 5–3తో యుకారి కొనిషి–తొమొయుకి మత్సుదా (జపాన్‌) జోడీపై గెలిచింది. మూడో స్థానంలో నిలిచిన నఫాస్వన్‌ యాంగ్‌పైబూన్‌–కెవిన్‌ వెంటా (స్లొవేనియా) జంటకు కాంస్య పతకం లభించింది. షూటింగ్‌ రేంజ్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మిక్స్‌డ్‌ ఈవెంట్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించినందుకు షూటర్లకు పతకాలు ప్రదానం చేసినా ఫలితాలకు మాత్రం అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. పతకాల పట్టిక జాబితాలో కూడా వీటిని చేర్చలేదు.

పాయింట్‌ తేడాతో...: మరోవైపు పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో అంకుర్‌ మిట్టల్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కేవలం పాయింట్‌ తేడా తో అంకుర్‌కు స్వర్ణం చేజారింది. ఫైనల్లో అంకుర్‌ 74 పాయింట్లు స్కోరు చేశాడు. జేమ్స్‌ విలెట్‌ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్‌ డీడ్మన్‌ (బ్రిటన్‌–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన సంగ్రామ్‌ దహియా ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కొత్త నిబంధనల ప్రకారం డబుల్‌ ట్రాప్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో షాట్‌ల సంఖ్యను 50 నుంచి 80 షాట్‌లకు పెంచారు. 30 షాట్‌లు పూర్తయిన తర్వాత తక్కువ స్కోరు ఉన్న వారు నిష్క్రమించడం మొదలవుతుంది. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో అంకుర్‌ 137 పాయింట్లతో నాలుగో స్థానంలో, సంగ్రామ్‌ 138 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించారు. 15 ఏళ్ల శపథ్‌ భరద్వాజ్‌ 132 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టాప్‌–6లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌ ఫైనల్లో తేజస్విని సావంత్‌ 402.4 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌ రజతం, కాంస్యం నెగ్గింది. 
 

మరిన్ని వార్తలు