మరో క్లీన్‌స్వీప్‌పై దృష్టి!

17 Jul, 2015 14:27 IST|Sakshi
మరో క్లీన్‌స్వీప్‌పై దృష్టి!

జోరు మీదున్న టీమిండియా
ఒత్తిడిలో జింబాబ్వే
నేడు తొలి టి20 మ్యాచ్

 
స్టార్ ఆటగాళ్లు లేకపోయినా భారత జట్టు బలమేమిటో వన్డే సిరీస్‌లో ఏకపక్ష విజయంతో తేలిపోయింది. మన కుర్రాళ్ల సత్తా ఏమిటో కూడా అందులో బయటపడింది. ఇక ఇదే జోరును కొనసాగించి పర్యటనలో పరిపూర్ణ విజయం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టి20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. మరో వైపు ఆతిథ్య జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.
 
హరారే: ఐదేళ్ల క్రితం భారత్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు టి20 మ్యాచ్‌లలోనూ మన జట్టుదే పైచేయి అయింది. ఇది మినహా ఈ టీమ్‌ల మధ్య మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఇప్పుడు అదే మైదానంలో మరో సారి పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే సిరీస్ గెలిచిన భారత్ మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా, జింబాబ్వే సంచలనాన్ని ఆశిస్తోంది.
 
అంతా సిద్ధం

 ఐపీఎల్ ద్వారా టి20ల్లో అమితానుభవం గడించిన భారత ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో ప్రత్యర్థితో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఒకరు ఇద్దరు కాకుండా జట్టులో దాదాపు అంతా టి20 శైలికి తగిన ఆటగాళ్లే. మూడో వన్డేలో విజయం సాధించిన తుది జట్టునే ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే అన్ని మ్యాచ్‌లలో విఫలమైన మనోజ్ తివారిని తప్పిస్తే సంజు శామ్సన్‌కు కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడే చాన్స్ రావచ్చు. రహానే, విజయ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఆ తర్వాత ఉతప్ప మూడో స్థానంలో వస్తాడు. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఉతప్ప ఇక్కడైనా రాణించాల్సి ఉంది. రాయుడు స్థానంలో వన్డేలో బరిలోకి దిగిన మనీశ్ పాండే ఈ ఫార్మాట్‌లోనూ ధాటిగా ఆడగల సమర్థుడు కాబట్టి మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పేసర్లు భువీ, మోహిత్‌లతో పాటు ఆల్‌రౌండర్‌గా బిన్నీ కీలక పాత్ర పోషిస్తాడు.

 రికార్డు అంతంత మాత్రం
 మరో వైపు జింబాబ్వే టి20 రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఓవరాల్‌గా గెలిచిన 6 మ్యాచ్‌లలో 2007లో ఆస్ట్రేలియాపై మినహా మిగతా అన్నీ చిన్న జట్లపైనే. ఆ జట్టులోని ఆటగాళ్లకు కూడా అనుభవం తక్కువ. వన్డే సిరీస్‌లో కాస్త మెరుగ్గా కనిపించిన తమ బౌలింగ్ ఇక్కడా ఏదైనా సంచలనానికి అవకాశం కల్పిస్తుందని కోచ్ వాట్‌మోర్ ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో చిబాబా ప్రధాన ఆటగాడు కాగా, వన్డేల్లో పెద్దగా రాణించని సీనియర్లు మసకద్జా, చిగుంబురాలపై జట్టు ఆధార పడింది. బౌలింగ్‌లో రజా, ఉత్సెయ, విటోరిలు రాణించడంపైనే జింబాబ్వే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి అన్ని రంగాల్లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్న చోట ఆతిథ్య జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వగలదో చూడాలి.

జట్ల వివరాలు (అంచనా)
భారత్: రహానే (కెప్టెన్), విజయ్, ఉతప్ప, తివారి/శామ్సన్, పాండే, జాదవ్, బిన్నీ, హర్భజన్, అక్షర్, భువనేశ్వర్, మోహిత్.
 జింబాబ్వే: చిగుంబుర (కెప్టెన్), మసకద్జా, చిబాబా, చకాబ్వా, రిచ్మండ్, రజా, విలియమ్స్/వాలర్, ఉత్సెయ, తిరిపనో, మద్‌జివా, విటోరి.
 
 రెండో ర్యాంక్‌లోనే భారత్
 దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాకు కలిసొచ్చింది. ప్రస్తుతం 115 పాయింట్లతో ఉన్న భారత్... అ గ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (129) కంటే 14 పాయింట్లు వెనుకబడి ఉంది. మరోవైపు స్వదేశంలో వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లను గెలిచి ఏడో ర్యాంక్‌లో నిలిచిన బంగ్లాదేశ్ 2017 చాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
 
 

మరిన్ని వార్తలు