కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్‌

31 Jul, 2019 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగాలని కోరుకుంటున్నానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు తమను ప్రభావితం చేయవని క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ తెలిపాడు. ఓపెన్‌ మైండ్‌తోనే ఎంపిక ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశాడు. తమకు బీసీసీఐ నిర్ధేశించిన మార్గదర్శకాలే కీలకమన్నాడు. ‘అతను కెప్టెన్‌ ఏమైనా మాట్లడగలడు. అవి మమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయవు. అతని అభిప్రాయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. తప్పా మేం కాదు. ఎంపిక ప్రక్రియ అనేది బీసీసీఐపైనే ఆధారపడి ఉంటుంది. వారిచ్చే గైడ్‌లైన్స్‌ మేరకే మా ఎంపిక ఉంటుంది. కోహ్లి అతినికేం కావాలో చెప్పాడు. మహిళా జట్టు కోచ్‌ ఎంపిక చేసినప్పుడు మేం ఎవ్వరిని సంప్రదించలేదు. మా విధానంలోనే ఎంపికచేశాం.

ఓపెన్‌ మైండ్‌తో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. దేశ, విదేశాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. నేను, కపిల్‌ ఇద్దరం కోచ్‌గా పనిచేసినవాళ్లమే. కావునా జట్టుకు ప్రయోజనకరమైనవి ఏంటో మాకు తెలుసు. ప్రస్తుత కోచ్‌ పర్యవేక్షణలో జట్టు బాగానే రాణించింది. కానీ ఇంకా బాగా ఆడాల్సింది. కోచ్‌ ఎంపికప్రక్రియలో చాలా అంశాలు ఉన్నప్పటికీ.. ఆటగాళ్లను సమన్వయపరచడం, ప్రణాళికలు రచించంచడం, సాంకేతికంగా అనుభవం కలిగి ఉండటం. ఈ మూడు లక్షణాలు మాత్రం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మూడు ఉన్నవారే కోచ్‌గా రాణిస్తారు.’ అని గైక్వాడ్‌ పేర్కొన్నారు.  త్వరలో టీమిండియా కోచ్‌ ఎంపిక ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో గైక్వాడ్‌ తరచు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు