భారత్‌ Vs శ్రీలంక: కశ్మీర్‌ ఇవ్వాలంటూ బ్యానర్‌ 

7 Jul, 2019 12:12 IST|Sakshi

బీసీసీఐ ఫైర్‌.. ఐసీసీకి లేఖ

లీడ్స్‌ : శ్రీలంకతో మ్యాచ్‌ జరుగుతుండగా మైదానం మీదుగా చక్కర్లు కొట్టిన ఓ గుర్తు తెలియని విమానం భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించింది. ప్రస్తతం ఈ బ్యానర్ల వ్యవహారం తీవ్ర దుమారాన్నిరేపుతోంది. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అంతర్జాతీయా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కి లేఖ రాసింది. ఈ దశ్చర్యను ఐసీసీ సైతం ఖండించింది. 

శనివారం శ్రీలంకతో మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది క్షణాలకే ఆ విమానం మైదానం మీదుగా చక్కర్లు కొడుతూ బ్యానర్‌ను ప్రదర్శించింది. ఈ బ్యానర్‌పై ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ అని ఉంది. మరో అరగంట తర్వాత మరోసారి చక్కర్లు కొడుతూ.. ‘కశ్మీర్‌లో భారత్‌ మారణహోమానికి ముగింపు పలకాలి. కశ్మీర్‌ను ఇచ్చేయాలి’ అనే మరో బ్యానర్‌ను ప్రదర్శించింది. ఇక మ్యాచ్‌ మధ్యలో భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ప్రదర్శించిన బ్యానర్‌పై ‘మూకదాడులకు ముగింపు పలకాలి’  అని పేర్కొంది.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ వెంటనే ఐసీసీని నిలదీసింది. ‘ఇది ఏమాత్రం ఆహ్వానించదగిన వ్యవహారం కాదు. ఇప్పటికే మేం ఐసీసీకి లేఖ రాశాం. సెమీపైనల్లో కూడా ఇదే పునరావృతం అయితే మాత్రం బాగుండదని మా వాదనను లేవనెత్తాం. మాకు మా ఆటగాళ్ల భద్రత ముఖ్యమని స్పష్టం చేశాం’ అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

అయితే బ్యానర్లు ప్రదర్శించిడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో సైతం ఓ గుర్తు తెలియని విమానం ‘జస్టిస్‌ ఫర్‌ బలోచిస్తాన్‌’  అనే బ్యానర్‌ను ప్రదర్శించింది. స్టేడియంలోని ప్రేక్షకులు ఈ బ్యానర్లు ప్రదర్శించడాన్ని తమ మొబైల్స్‌తో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. నార్త్‌ ఇంగ్లండ్‌లో యార్క్‌షైర్‌లో పాకిస్తాన్‌ జనాభా ఎక్కువగా ఉంటుంది. అక్కడి వారే ఈ పనిచేసి ఉంటారని భావించి యార్క్‌షైర్‌ పోలీసులకు ఐసీసీ ఫిర్యాదు చేసింది.  ‘ ఈ తరహా ఘటన మళ్లీ పునరావృతం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాం. క్రికెట్‌ ప్రపంచకప్‌ వేదికగా ఎలాంటి రాజకీయ సందేశాలను అనుమతించం. ఈ టోర్నీ మొత్తం స్థానిక పోలీసులే భద్రత కల్పించారు. ఈ తరహా నిరసనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. గత ఘటన జరిగినప్పుడే మేం యార్క్‌షైర్‌ పోలీసులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటివి మళ్లీ జరగుకుండా చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ మళ్లీ రిపీట్‌ అవడంతో అసంతృప్తికి లోనయ్యాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు