మెయిన్ ‘డ్రా’కు అజయ్ అర్హత

2 Apr, 2014 01:29 IST|Sakshi
మెయిన్ ‘డ్రా’కు అజయ్ అర్హత

ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు అజయ్ కుమార్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అజయ్ 22-20, 23-21తో ఇటీవల జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన చాంపియన్ అరవింద్ భట్ (భారత్)ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో ఈ హైదరాబాదీ 21-13, 21-15తో దీపక్ ఖత్రీ (భారత్)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ తలపడతాడు.
 
 మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చేతన్ ఆనంద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. జాతీయ మాజీ చాంపియన్ అనూప్ శ్రీధర్ 21-14, 21-16తో చేతన్‌ను ఓడించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల- జిష్ణు సన్యాల్ జోడి క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. రెండో అర్హత పోరులో గుత్తా జంట 12-21, 15-21తో తకెషి కముర-మిసాటో అరతమా (జపాన్) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది.
 
 బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో జెంగ్‌మింగ్ వాంగ్ (భారత్)తో పారుపల్లి కశ్యప్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; పెంగ్యూ డూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా (జపాన్)తో శ్రీకాంత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో ఆనంద్ పవార్; లాంగ్ చెన్ (చైనా)తో ప్రణయ్; ఇవనోవ్ (రష్యా)తో సౌరభ్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సిమోన్ (ఆస్ట్రియా)తో సైనా నెహ్వాల్, షిజియాన్ వాంగ్ (చైనా)తో పి.వి.సింధు పోటీపడతారు.
 

మరిన్ని వార్తలు