కోహ్లికి కోహ్లి రాయునది... 

6 Nov, 2019 04:09 IST|Sakshi
భూటాన్‌లో కోహ్లి, అనుష్క దీపారాధన

15 ఏళ్ల కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించిన భారత కెప్టెన్‌

పుట్టిన రోజున తనకు తాను రాసుకున్న లేఖ

న్యూఢిల్లీ: అత్యద్భుతమైన ఆటతో, అనితర సాధ్యమైన ఘనతలు సాధిస్తూ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పుడు క్రికెట్‌ శిఖరాన ఉన్నాడు. 11 ఏళ్ల క్రితం అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే అంతకంటే ముందే మరో ఐదేళ్లు వెనక్కి వెళ్తే అప్పటికే ఆటలో తనదైన ముద్ర కోసం కోహ్లి తపిస్తున్నాడు. కానీ లక్ష్యం చేరగలడో లేదో తెలీదు. కానీ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుందనే నమ్మకం. ఆ సమయంలో తోడుగా తండ్రి కూడా ఉన్నాడు (కోహ్లి 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు). మొత్తంగా 15 ఏళ్ల కుర్రాడిలో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు! మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి ఆ కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించాడు. గొప్ప క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్న ఒక 15 ఏళ్ల కుర్రాడి కథతో రూపొందించిన ‘సూపర్‌ వి’ అనే యానిమేటెడ్‌ సిరీస్‌ కోసం విరాట్‌ ఈ తరహా ప్రయత్నం చేశాడు. ఒకవైపు తన గురించి తాను (కోహ్లి ముద్దు పేరు చీకూ) లేఖలో రాస్తూనే మరోవైపు అదే వయసు పిల్లలకు ఒక దిశానిర్దేశం చేశాడు. మంగళవారం తన 31వ పుట్టిన రోజు సందర్భంగా రాసిన ఈ లేఖలోని విశేషాలు చూస్తే...

‘హాయ్‌ చీకూ...నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎన్నో అడగాలనుకుంటున్నా నేను కొన్నింటికే సమాధానమిస్తా. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో తెలియనప్పుడు ఆపై దక్కేది మధురంగా, ప్రతీ సవాల్‌ అద్భుతంగా ఉంటుంది. ప్రతీ నిరాశ కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు. లక్ష్యంకంటే ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంటుంది. విరాట్‌... నీకు లభించే ప్రతీ అవకాశం ఉపయోగించుకోవడం ముఖ్యం. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. జీవితంలో ఓటములు సహజం. కానీ ప్రయత్నించడం మాత్రం మరచిపోవద్దు. నిన్ను ప్రేమించేవాళ్లు, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా నీపై నువ్వు నమ్మకముంచు. డాడీ బహుమతిగా షూస్‌ ఇవ్వలేదని బాధపడవచ్చు. అంతకంటే ఎక్కువగా పంచిన ప్రేమను ఆస్వాదించు. కొన్ని సార్లు ఆయన కఠినంగా ఉన్నా అది నీ బాగు కోసమే. తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ బేషరతుగా మనల్ని ప్రేమించేది వారే. నీ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో నీ మనసు చెప్పిందే విను. పెద్ద కలలు కనడం కూడా ఎంత ముఖ్యమో ఈ ప్రపంచానికి చూపించు. చివరగా ఆ పరోఠాల రుచిని బాగా ఆస్వాదించు. మున్ముందు అవి మరీ ప్రియంగా మారిపోవచ్చు’

మరిన్ని వార్తలు