పసిడి పోరుకు ప్రసాద్‌ 

8 Feb, 2020 08:05 IST|Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): బోక్‌స్కాయ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ పీఎల్‌ ప్రసాద్‌ పురుషుల 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల ప్రసాద్‌ సెమీఫైనల్లో 4–1తో దివాలి దిమిత్రి (రష్యా)పై విజయం సాధించాడు. 91 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్‌ గౌరవ్‌కు తన ప్రత్యర్థి నుంచి వాకోవర్‌ లభించడంతో అతను ఫైనల్‌కు చేరాడు. మహిళల విభాగంలో జ్యోతి గులియా (51 కేజీలు), మనీషా (57 కేజీలు) కూడా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో మనీషా 4–1తో బాసానెట్స్‌ మెరియానా (ఉక్రెయిన్‌)పై, జ్యోతి 5–0తో మాండీ మేరీ (కెనడా)పై గెలుపొందారు.   

ఇంతింతై... 
విశాఖ స్పోర్ట్స్‌: 13 ఏళ్ల క్రితం మొదలైన ప్రసాద్‌ బాక్సింగ్‌ ప్రస్థానం నేడు అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. కోచ్‌ వెంకటేశ్వర రావు శిక్షణలో రాటుదేలిన ప్రసాద్‌ సరీ్వసెస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) జట్టు తరఫున జాతీయ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగి పతకాల వేట మొదలుపెట్టాడు. ఇప్పటికీ దానిని కొనసాగిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. విశాఖలోని అక్కయ్యపాలెంకు చెందిన ప్రసాద్‌ కాంబినేషన్‌ పంచ్‌లు సంధించడంలో దిట్ట. 2008 డిసెంబర్‌లో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసాద్‌ తొలి స్వర్ణాన్ని సాధించాడు. అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 

వివిధ కేటగిరీల్లో ఏడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ప్రసాద్‌ 2012లో ఫిన్లాండ్‌లో జరిగిన తామెర్‌ అంతర్జాతీయ టోరీ్నలో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2013లో ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. తల్లిదండ్రులు వేణుగోపాల్, గౌరిల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం భుజం గాయం అయింది. భుజానికి శస్త్ర చికిత్స జరిగాక కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ రింగ్‌లోకి అడుగు పెట్టాడు. పతకాల వేట మొదలుపెట్టాడు.    

, ,
 

మరిన్ని వార్తలు