ఏపీ స్విమ్మర్‌ తులసీ చైతన్య అరుదైన ఘనత

19 Sep, 2019 10:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్‌ ఎం.తులసీ చైతన్య అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. 35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను 30 ఏళ్ల తులసీ చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తి చేశాడు. విజయవాడలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీ చైతన్య ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్‌ స్విమ్మర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 2015, 2017 ఆలిండియా పోలీస్‌ అక్వాటిక్స్‌ మీట్‌లో ‘బెస్ట్‌ స్విమ్మర్‌’ పురస్కారం పొందిన తులసీ చైతన్య ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు అందించాడు.

కాటలీనా చానెల్‌ను ఈదడానికి తులసీ చైతన్య ద్రోణాచార్య అవార్డీ ప్రదీప్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ ఘనత సాధించే క్రమంలో తనకు మద్దతు నిలిచిన ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, అడిషనల్‌ డీజీపీ శ్రీధర్‌ రావు, రూ. 2 లక్షల ఆరి్థక సహాయం అందించిన పాలకొల్లుకు చెందిన వ్యాపారవేత్త నరసింహ రాజు, తెలంగాణ ప్రిన్సిపల్‌ హోం సెక్రటరీ రాజీవ్‌ త్రివేదిలకు ఈ సందర్భంగా తులసీ చైతన్య కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఏడాది జిబ్రాల్టర్‌ జలసంధిని ఈదడమే తన లక్ష్యమని, ఇప్పటి నుంచే దాని కోసం శిక్షణ ప్రారంభిస్తానని తులసీ చైతన్య తెలిపాడు.  

మరిన్ని వార్తలు