‘మమ్మల్ని వేధింపులకు గురి చేశారు’

24 Jun, 2018 16:23 IST|Sakshi

విజయవాడ: ఏపీ కబడ్డీ సంఘంలో లైంగిక ఆరోపణల ఎపిసోడ్‌పై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తమను ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి కార్యదర్శి వీరలంకయ్య వేధిస్తున్నాడని, సర్టిఫికేట్లు అమ్ముకున్నాడని పలువురు మహిళా క్రీడాకారిణులు మీడియా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి శ్రీకాంత్‌తో కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ అవతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని శ్రీకాంత్‌ నిలదీశారు. వీరలంకయ్యకు ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ సపోర్టు ఉందని అన్నారు.

తాను క్షమాపణ కోరుతూ లెటర్‌ రాశానని ప‍్రభాకర్‌ చెబుతున్న విషయం కూడా అబద్ధమని పేర్కొన్న శ్రీకాంత్‌.. అది ఫోర్జరీ చేసిన లెటర్‌ అని తెలిపారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల‍్పడలేదని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

మరొకవైపు వీరలంకయ్యపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా క్రీడాకారిణులు కోరుతున్నారు. మహిళా క్రీడాకారిణులను వీర లంకయ్య వేధించకపోతే ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు.  ఆయన్ని వెంటనే అసోసియేషన్ నుంచి తొలగించడంతో పాటు, దొంగ సర్టిఫికేట్ పై ఏసీబీ విచారణ జరిపించాలన్నారు. ఒక్కొక్క సర్టిఫికేట్‌ను ఏడున్నర లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేసే అధికారం స్టేట్‌ బాడీకు లేదన్నారు.

మరిన్ని వార్తలు