ఆదుకున్న అపరాజిత్, పాండే

4 Oct, 2013 01:46 IST|Sakshi

చెన్నై: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు కోలుకుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో వెస్ట్‌జోన్‌తో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సరికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (131 బంతుల్లో 93 బ్యాటింగ్; 11 ఫోర్లు), మనీశ్ పాండే (118 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 161 పరుగులు జోడించారు.

అంతకు ముందు టాస్ గెలిచిన సౌత్ జోన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దులీప్ ట్రోఫీలో తొలి సారి తుది జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అక్షత్ రెడ్డి (23 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముకుంద్ (4), రాహుల్ (6) కూడా తొందరగానే అవుట్ కావడంతో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సౌత్ జోన్ కష్టాల్లో పడింది. ఈ దశలో అపరాజిత్, పాండే జట్టును ఆదుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తొలి రోజు కేవలం 54 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
 

మరిన్ని వార్తలు