ద్రవిడ్, జహీర్ లపై నిర్ణయం పెండింగ్!

15 Jul, 2017 15:54 IST|Sakshi
ద్రవిడ్, జహీర్ లపై నిర్ణయం పెండింగ్!

ముంబై:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రి నియామకాన్ని మాత్రమే సమర్ధిస్తున్న బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) మరోసారి ఆ విషయాన్ని స్ఫష్టం చేసింది. భారత క్రికెట్ బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా రాహుల్ ద్రవిడ్ కు బాధ్యతలు అప్పచెబుతూ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) తీసుకున్న నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉందని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ తాజాగా స్పష్టం చేశారు.

 

ఈ మేరకు జాతీయ న్యూస్ ఛానలె రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్, ద్రవిడ్ ల నియామకంపై మాట్లాడారు. వారి ఎంపికకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జూలై 22వ తేదీన వారి పదవులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఏసీ ఎంపిక చేసిన ప్రధాన కోచ్ రవిశాస్త్రి నియమాకాన్ని మాత్రమే అధికారంగా ధృవీకరించినట్లు వినోద్ రాయ్ తెలిపారు.రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ ల విషయంపై సమీక్ష జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం ప్రధాన కోచ్ ను మాత్రమే ఎంపిక చేయాల్సిన సీఏసీ.. మరో అడుగు ముందుకేసి బౌలింగ్ , బ్యాటింగ్ కన్సల్టెంట్ లను ఎంపిక చేయడం సీవోఏకు ఆగ్రహం తెప్పించింది. దీనిలో భాగంగానే ఆ ఇద్దరి ఎంపికను పెండింగ్ లో పెట్టింది.

మరిన్ని వార్తలు