ప్రపంచ రికార్డు... పసిడి పతకం

24 Feb, 2019 00:16 IST|Sakshi

భారత మహిళా షూటర్‌  అపూర్వి చండేలా డబుల్‌ ధమాకా

ప్రపంచకప్‌లో స్వర్ణంతో భారత్‌ బోణీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ కొత్త సీజన్‌ను భారత్‌ పసిడి పతకం, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. శనివారం మొదలైన ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్‌ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్‌ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజు జావో 251.8 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గగా... హాంగ్‌ జు (చైనా–230.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయినప్పటికీ గతేడాదే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత్‌ గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖాయం చేసుకోవడంతో అపూర్వి తాజా ప్రదర్శనకు ఒలింపిక్‌ బెర్త్‌ రాలేదు.  

క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం... 
మొత్తం 101 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో    అపూర్వి 629.3 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్‌–8లో నిలిచిన వారు 24 షాట్‌లతో కూడిన ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వి కొట్టిన ప్రతీ షాట్‌ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. నిబంధనల ప్రకారం తొలి 12 షాట్‌లు పూర్తయ్యాక ఎనిమిది మందిలో తక్కువ స్కోరు ఉన్న షూటర్‌ నిష్క్రమిస్తారు. ఆ తర్వాత ప్రతి రెండు షాట్‌లకు తక్కువ స్కోరుతో ఉన్న షూటర్‌ పతకం రేసు నుంచి వెనుదిరిగారు. స్వర్ణం–రజతం కోసం చివరి రెండు షాట్‌లు మిగిలే సమయానికి అపూర్వి (231.6), రుజు జావో (230.8) మధ్య తేడా 0.8 మాత్రమే ఉంది. చివరి రెండు షాట్‌లలో అపూర్వి వరుసగా 10.8; 10.5... రుజు జావో 10.5; 10.5 స్కోరు చేశారు. దాంతో 1.1 స్కోరు తేడాతో అపూర్వికి స్వర్ణం ఖాయమైంది. భారత్‌కే చెందిన ఎలవెనిల్‌ వలరివాన్‌ (628 పాయింట్లు) 12వ స్థానంలో... అంజుమ్‌ మౌద్గిల్‌ (625.3 పాయింట్లు) 30వ స్థానంలో నిలిచారు. 


► 3 ప్రపంచకప్‌ టోర్నీల్లో అపూర్వి నెగ్గిన పతకాలు.  కొరియాలో 2015 జరిగిన ఈవెంట్‌లో ఆమె కాంస్యం, అదే ఏడాది వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీలో రజతం సాధించింది.   

మరిన్ని వార్తలు