-

ఇంగ్లండ్‌ క్రికెటర్లకు జరిమానా.. పాక్‌కు కూడా

4 Jun, 2019 19:45 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లండ్‌ క్రికెటర్లు జేసన్‌ రాయ్‌, జోఫ్రా ఆర్చర్‌లకు ఐసీసీ జరిమానా విధించింది. అంతేకాకుండా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. 

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాక్‌ సారథి సర్ఫరాజ్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు, జట్టులోని మిగతా సభ్యుల ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా 14వ ఓవర్‌లో జేసన్‌ రాయ్‌ మిస్‌ ఫీల్డింగ్‌ అనంతరం అంపైర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రాయ్‌కు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇదే మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు 15 శాతం కోత విధించారు. అంతేకాకుండా వీరిద్దరికీ జరిమానాతో పాటు చెరో డీమెరిట్‌ పాయింట్‌ను ఐసీసీ జత చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు మ్యాచ్‌ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు