అందుకు జోఫ్రా ఆర్చరే కారణం: స్టోక్స్‌

17 Sep, 2019 12:22 IST|Sakshi

లండన్‌: తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటున్నాడు ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌. వరల్డ్‌కప్‌ దగర్నుంచీ, యాషెస్‌ సిరీస్‌ వరకూ ఎవరో ఒకరు గాయపడితే తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆర్చర్‌ తానేమిటో నిరూపించుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్చర్‌.. యాషెస్‌ సిరీస్‌లో సైతం సత్తాచాటాడు. ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌లో ఆర్చర్‌ 22 వికెట్లు సాధించి సిరీస్‌ సమం కావడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఒప్పుకున్నాడు.

‘మేము తిరిగి రేసులోకి వచ్చామంటే అది ఆర్చర్‌ వల్లే. తొలి టెస్టు కోల్పోయిన సమయంలో ఆర్చర్‌ రాక మాకు మరింత బలాన్ని ఇచ్చింది. మూడో టెస్టు, ఐదో టెస్టుల్లో గెలిచామంటే ఆర్చరే కారణం.  నేను క్రికెట్‌ ఆడుతున్న సమయం నుంచి చూస్తే ఆర్చర్‌ వంటి నైపుణ్యం ఉన్న బౌలర్‌ను చూడలేదు. ఆర్చర్‌ మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం. యాషెస్‌ను కోల్పోకుండా సమం చేశామంటే అందులో ఆర్చర్‌ పాత్ర చాలా ఎక్కువ. అందులో ఎటువంటి సందేహం లేదు. బిగ్‌బాష్‌ లీగ్‌తో తెరపైకి వచ్చిన ఆర్చర్‌.. అనుభవాన్ని కూడాగట్టుకుంటూ తన మార్కును చూపెడుతున్నాడు. నిలకడగా 90 మైళ్ల వేగంతో బంతులు సంధించడం అంటే మాటలు కాదు. ప్రపంచంలో ఎంతటి గొప్ప క్రికెటర్‌కైనా ఆర్చర్‌ ఒక ప్రమాదకర బౌలరే’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు