కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ దీక్ష భగ్నం!

8 May, 2018 15:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ  తనను, తన కుటుంబాన్ని అవమానించారంటూ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుణదల స్మశానవాటికలోని తన కుమారుడు లెనిన్ సమాధి వద్ద దీక్ష చేస్తున్న ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. జోత్యి సురేఖ, ఆమె తండ్రి తన కుటుంబాన్ని అవమానించారని, ఆమె తనకు గురుద్రోహం చేసిందని ఆరోపిస్తూ.. చేరుకూరి సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. జ్యోతి సురేఖ తమకు క్షమాపణ చెప్పేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తానే కాదు తన భార్య కూడా నివాసంలో దీక్ష చేస్తోందని చెప్పారు. జ్యోతిసురేఖను తాను ఎప్పుడు15 లక్షల రూపాయలు అడగలేదని అన్నారు. తమ పేరు చెప్పి.. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌లోనేనని ఆయన తెలిపారు.

కాగా, ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ  రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని జ్యోతి సురేఖ ఖండించిన విషయం తెలిసిందే. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని ఆమె స్పష్టం చేశారు. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్‌ అని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని, దీంతో పెట్రోలియం స్పోర్ట్స్‌ బోర్డ్‌ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపారు. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. మరోవైపు జ్యోతిసురేఖకు బేసిక్‌ కోచ్‌ను తానేనని చెరుకూరి సత్యనారాయణ వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు