భారత మహిళల జట్టుకు స్వర్ణం

22 Jul, 2013 06:07 IST|Sakshi

మెడిలిన్ (కొలంబియా): పసిడి పతకమే లక్ష్యంగా గురి పెట్టిన భారత మహిళా ఆర్చర్లు అనుకున్నది సాధించారు. ఆదివారం ముగిసిన ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో దీపిక కుమారి, రిమిల్ బురులీ, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టాప్ సీడ్, లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 201-186 (46-33, 51-51, 50-50, 54-52) స్కోరుతో ఘనవిజయం సాధించింది.

 

2011లో షాంఘై వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు బంగారు పతకం లభించడం ఇదే తొలిసారి. గత పదేళ్లలో 12 సార్లు చైనాతో పోటీపడిన భారత్ ఐదుసార్లు గెలుపొంది, ఏడుసార్లు ఓటమి పాలైంది. చైనాతో జరిగిన పోటీలో భారత ఆర్చర్లు నిలకడగా స్కోరు చేశారు. ఆరు బాణాలు సంధించే తొలి సిరీస్‌లోనే భారత్ ఏకంగా 13 పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. చైనా 33 పాయింట్లు స్కోరు చేయగా... భారత్ 46 పాయింట్లతో ముందంజ వేసింది. ఆ తర్వాత చివరిదైన నాలుగో సిరీస్ వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
 

మరిన్ని వార్తలు