అర్జెంటీనా.. అదరగొట్టింది

27 Jun, 2018 02:10 IST|Sakshi
మెస్సీ, రోజో సంబరాలు

మెస్సీ బృందం నౌకౌట్‌ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన కీలక పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌ ఆశలను సజీవం చేసుకుంది. 14 వ నిమిషంలో లియోనల్‌ మెస్సీ అద్బుత గోల్‌తో ఖాతా తెరిచిన అర్జెంటీనా తొలి అర్థబాగంలో నైజీరియాపై ఆధిక్యం కనబర్చింది. అయితే రెండో అర్ధబాగంలో అనూహ్యంగా నైజీరియా నుంచి మెస్సీ బృందానికి గట్టి పోటీ ఎదురైంది. 49 వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్‌ చేయడంతో నైజీరియాకు పెనాల్టీ లభించింది. దీన్ని ఉపయోగించుకున్న నైజిరియా ఆటగాడు విక్టర్ మోసెస్ తెలివిగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ప్రపంచకప్‌లో పెనాల్టీగోల్‌ సాధించిన రెండో ఆటగాడిగా విక్టర్‌ మోసెస్‌ రికార్డు నమోదు చేశాడు. 2010 ప్రపంచకప్‌లో యాకుబ్‌ నెట్టెడ్‌ నైజీరియా తరపున తొలిసారి పెనాల్టీ గోల్‌ సాధించాడు.

విక్టర్‌ సాధించిన గోల్‌తో స్కోర్‌ సమం అయ్యాయి. ఇక హోరాహోరిగా సాగిన గేమ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. 86 వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్‌ రోజో అనూహ్యంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు ఆధిక్యాన్నందించాడు. అనంతరం నైజీరియాకు అవకాశం లభించకపోవడంతో అర్జెంటీనా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు మెస్సీ మీద ఆధారపడకుండా అద్బుత ప్రదర్శన కనబర్చారు. ఇక అర్జెంటీనా నాకౌట్‌ చేరే అవకాశం క్రొయేషియా–ఐస్‌లాండ్‌ మ్యాచ్‌ ఫలితం పైనా ఆధారపడి ఉంది. ఇప్పటికే క్రోయేషియా నాకౌట్‌ చేరింది. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన ఈ మాజీ విశ్వవిజేత క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవకుండా పరాజయం పాలైన విషయం తెలిసిందే.  ఐస్‌లాండ్‌పై క్రొయేషియా గెలిచినా, మ్యాచ్‌ డ్రా అయినా అర్జెంటీనాకు నాకౌట్‌ చేరే అవకాశం లభిస్తోంది.

మరిన్ని వార్తలు