అర్పిత్‌ సెంచరీ: సౌరాష్ట్ర 384/8

11 Mar, 2020 01:12 IST|Sakshi

రాజ్‌కోట్‌: అర్పిత్‌ వసవాడా (287 బంతుల్లో 106; 11 ఫోర్లు) అద్భుత సెంచరీ... చతేశ్వర్‌ పుజారా (237 బంతుల్లో 66; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌... వెరసి బెంగాల్‌ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 206/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 160  ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌ చేశాడు. అర్పిత్‌తో కలిసి పుజారా సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్‌కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన అర్పిత్‌ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. ఓవరాల్‌గా రెండో రోజు సౌరాష్ట్ర 79.1 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. చివరి సెషన్‌లో అర్పిత్,  పుజారా అవుటైనా అప్పటికే బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం చిరాగ్‌ జానీ (44 బంతుల్లో 13 బ్యాటింగ్‌), ధర్మేంద్ర సింగ్‌ జడేజా (22 బంతుల్లో 13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు