పాక్కు 'వరల్డ్ కప్' వార్నింగ్!

2 Sep, 2016 13:44 IST|Sakshi
పాక్కు 'వరల్డ్ కప్' వార్నింగ్!

లీడ్స్: ఇటీవల టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ ర్యాంకును సొంతం చేసుకున్న పాకిస్తాన్.. వన్డేల్లో మాత్రం అత్యంత పేలవంగా ఆడుతోంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్తో జరిగిన నాలుగు వన్డేల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలుకావడం ఆ జట్టు శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఐదు వన్డేల సిరీస్కు ముందు తొమ్మిది ర్యాంకుతో బరిలోకి దిగిన పాకిస్తాన్ వరుసగా నాలుగు వన్డేల్లో ఓటమి పాలు కావడంతో ఆ జట్టు వన్డే భవితవ్యంపై నీలి నీడలు అలముకున్నాయి. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి పాకిస్తాన్ టాప్-8లో నిలవకపోతే ఆ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. వన్డే ర్యాంకింగ్స్లో అఫ్ఘానిస్తాన్ 10 వ ర్యాంకులో ఉండగా, పాకిస్తాన్ మాత్రం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

 

 ఈ సిరీస్ అనంతరం పాకిస్తాన్ ర్యాంకింగ్స్లో ఏ మాత్రం మార్పులేకపోయినప్పటికీ, రాబోవు సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీతో పాటు,  మినీ వరల్డ్ కప్ కూడా ఉంది. కనీసం ఈ టోర్నీలకైనా అర్హత సాధిస్తామా? అనేది కొత్తగా పాక్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన మికీ ఆర్థర్ ప్రశ్న.  పాకిస్తాన్ ఆడబోయే తదుపరి టోర్నీలు ఏమాత్రం అంత సులువుగా లేనందును జట్టులోని ఆటగాళ్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందంటూ ఆర్థర్ వార్నింగ్ ఇచ్చాడు. త్వరలో వెస్టిండీస్తో పాకిస్తాన్  వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో అప్పటికైనా ఆటగాళ్లు తమ బాధ్యతను గుర్తించాలంటూ చురకలంటించాడు. వన్డేల్లో వెస్టిండీస్ చాలా మెరుగైన జట్టు అని సంగతిని పాక్ క్రికెటర్లు గుర్తించి దానికి తగిన విధంగా సన్నద్ధం కావాలన్నాడు.  అసలు వన్డేల్లో తొమ్మిదో ర్యాంకు ఎందుకు పడిపోయామో ఒక్కసారిగా ఆటగాళ్లు ఆత్మపరిశీలన చేసుకోండి అంటూ మండిపడ్డాడు. ఇలా ర్యాంకింగ్స్లో దిగజారడం అసహ్యం కల్గిస్తుందంటూ ధ్వజమెత్తాడు.

1992 వన్డే వరల్డ్ కప్ గెలిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు..  2019 వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించాలంటే ఆతిథ్య దేశం ఇంగ్లండ్ ను మినహాయించి టాప్-7 లో నిలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ  రాబోవు రెండు సంవత్సరాల్లో పాకిస్తాన్ వన్డే ర్యాంకింగ్స్ లో పెద్దగా మార్పు ఉండకపోతే క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి వుంటుంది. 2018 లో బంగ్లాదేశ్ లో జరిగే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో పది జట్లు తలపడనున్నాయి. దీనిపైనే పాక్ క్రికెట్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా వరల్డ్ కప్ కు దాదాపు మూడు సంవత్సరాల సమయం ఉండటంతో  అప్పటికి పాకిస్తాన్ నేరుగా బరిలో ఉంటుందా? లేక క్వాలిఫయింగ్ ఆడే తలనొప్పిని తెచ్చుకుంటుందా?అనేది పీసీబీ పెద్దలకు మింగుడు పడటం లేదు.

మరిన్ని వార్తలు