చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?

28 Jul, 2019 15:15 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను తిరిగి కొనసాగించాలా.. వద్దా అనే దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థర్‌కు మరో చాన్స్‌ ఇవ్వాలంటూ పాక్‌ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్‌ పేర్కొనగా,  ఆ దేశానికే స్పిన్‌ లెజెండ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ మాత్రం విభేదించాడు. ఇంకెంత కాలం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. అసలు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఆర్థర్‌ ఏమి చేశాడంటూ నిలదీశాడు.  అదే సమయంలో అక్రమ్‌ సూచనను తప్పుబట్టాడు. తన దృష్టితో చూస్తే ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని అక్రమ్‌ పీసీబీకి చెప్పడం న్యాయం కాదన్నాడు. పీసీబీ కమిటీలో సభ్యుడిగా ఉన్న అక్రమ్‌.. ఆర్థర్‌ అండగా నిలవడం బాలేదన్నాడు. తానైతే ఆర్థర్‌ సేవలు ఇక పాకిస్తాన్‌కు అవసరం లేదనే చెబుతానన్నాడు.

ఆర్థర్‌ వచ్చిన తర్వాత పాక్‌ క్రికెట్‌ జట్టుకు నష్టమే జరిగిందే కానీ లాభం చేకూరలేదన్నాడు. కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అక్మల్‌, సొహైల్‌ ఖాన్‌ వంటి క్రికెటర్లు దూరం కావడానికి ఆర్థరే కారణమని విమర్శించాడు. వహాబ్‌ రియాజ్‌ వంటి ఒక స్టార్‌ పేసర్‌ పాక్‌ క్రికెట్‌కు రెండేళ్లు దూరం కావడానికి ఆర్థరే కారణమన్నాడు. వరల్డ్‌కప్‌కు చివరి నిమిషంలో గత్యంతరం లేక ఒత్తిడితో రియాజ్‌కు చోటు ఇవ్వడానికి ఆర్థర్‌ ఒప్పుకున్నాడని ఖాదిర్‌ విమర్శించాడు. ఇక ఆర్థర్‌ సేవలకు స్వస్తి పలకాలని సూచించాడు. పాక్‌ జాతీయ క్రికెట్‌ జట్టును ముందుకు తీసుకు వెళ్లడానికి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నాడు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు