విధి లేకపోతేనే విదేశాల్లో ఐపీఎల్‌

8 Jul, 2020 00:34 IST|Sakshi

బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ వివరణ

న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్‌ టి20 టోర్నీ నిర్వహణకు ఏమాత్రం అవకాశమున్నా ఇక్కడే నిర్వహిస్తామని... ఏ దారీ లేకపోతేనే చివరి ప్రత్యామ్నాయంగా విదేశీ గడ్డ గురించి ఆలోచిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ స్పష్టం చేశారు. భారత్‌లో రోజురోజుకీ కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ ఈ సీజన్‌ విదేశాల్లోనే జరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు.

దీనిపై ధుమాల్‌ తాజాగా వివరణ ఇచ్చారు. బోర్డు ప్రాధాన్యం సొంతగడ్డపైనే అని విధిలేని పరిస్థితుల్లోనే విదేశీ వేదికను ఎంపిక చేస్తామన్నారు. ‘తదుపరి ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా వేదికపైనే చర్చిస్తాం. మా తొలి ప్రాధాన్యత భారత్‌కే. విదేశాల్లో నిర్వహణ అనేది ఆఖరి ప్రత్యామ్నాయం మాత్రమే’ అని ధుమాల్‌ అన్నారు. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌–2ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈసారి టోర్నీ గనక జరగకపోతే బోర్డుకు రూ. 4 వేల కోట్ల నష్టం వస్తుంది. అందుకే ఇంట అయినా.... బయటైనా ఈ సీజన్‌ను నిర్వహించాలనే లక్ష్యంతో బోర్డు ఉంది.

>
మరిన్ని వార్తలు