అరుణా రెడ్డికి ఏడో స్థానం

24 Aug, 2018 01:03 IST|Sakshi

జకార్తా: ఆసియా క్రీడల జిమ్నాస్టిక్స్‌లో తెలుగుతేజం బుద్దా అరుణారెడ్డి (12.775 పాయింట్లు) విఫలమైంది. మహిళల వాల్ట్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌కు (12.650 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానం దక్కింది.    

ఫైనల్లో మహిళల కబడ్డీ జట్టు... 
భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకోగా... భారత మహిళల కబడ్డీ జట్టు వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టింది. సెమీఫైనల్లో భారత్‌ 27–14తో చైనీస్‌ తైపీని ఓడించింది. మరో సెమీఫైనల్లో ఇరాన్‌ 23–16తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇరాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టారు.  

గురి తప్పిన దీపిక 
భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి మళ్లీ నిరాశపరిచింది. ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఆర్చర్‌ మూడో రౌండ్‌లో 3–7తో చియెన్‌ యింగ్‌ లీ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల రికర్వ్‌లో అతాను దాస్‌ క్వార్టర్స్‌లో 3–7తో రియు ఎగా అగత సాల్సా బిల్లా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.

మరిన్ని వార్తలు