‘బిర్లా’కూ మానసిక ఆందోళన!

21 Dec, 2019 03:08 IST|Sakshi

క్రికెట్‌కు విరామమిచ్చిన ఆర్యమాన్‌

ముంబై: అతని వయసు 22 ఏళ్లు... కాలు కదపాల్సిన అవసరం లేకుండానే సిద్ధంగా ఉన్న కోట్ల రూపాయల సామ్రాజ్యం...దేశాన్ని శాసించగల సంపద ఉన్న వ్యక్తి కుమారుడు...కానీ అతడిని కూడా మానసిక ఆందోళన వదల్లేదు. తాను ఎంచుకున్న దారిలో లక్ష్యం చేరుకోలేకపోవడం, అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం బహుశా అందుకు కారణం కావచ్చు! ఆ కుర్రాడి పేరు ఆర్యమాన్‌ బిర్లా. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కొడుకు. మధ్య ప్రదేశ్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ వచ్చిన ఆర్యమాన్‌ మానసికపరమైన ఆందోళనతో క్రికెట్‌నుంచి ‘నిరవధిక విరామం’ విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

తాను ఇష్టపడిన ఆటలో సాధ్యమైనంతంగా శ్రమించానని, అయితే ఇకపై తన ప్రయాణం గురించి కొత్తగా ఆలోచించాల్సి ఉందంటూ అతను వెల్లడించాడు. ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన ఆర్యమాన్‌ 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 27.60 సగటుతో 414 పరుగులు, 4 లిస్ట్‌–ఎ మ్యాచ్‌లలో 36 పరుగులు చేశాడు. 2018 ఐపీఎల్‌ వేలంలో అతడిని రూ. 30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్‌ గత ఏడాది కూడా కొనసాగించింది. అయితే రెండు సీజన్లలో కలిపి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సారి దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ బరిలోకి దిగకపోగా, ఐపీఎల్‌ వేలంలోనూ పాల్గొనలేదు.   

>
మరిన్ని వార్తలు