జైకోవిచ్...

6 Jun, 2016 07:19 IST|Sakshi
జైకోవిచ్...

కెరీర్ స్లామ్’ సాధించిన సెర్బియా స్టార్
ఈ ఘనత అందుకున్న ఎనిమిదో ప్లేయర్
ఎట్టకేలకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ హస్తగతం
ఫైనల్లో ఆండీ ముర్రేపై విజయం
వరుసగా 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అరుదైన ఘనత

 
 
జోకర్ కాదు... ఇప్పుడతను ‘కింగ్’. ఏక కాలంలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను చేత్తోపట్టిన టెన్నిస్ ప్రపంచపు రారాజు. పోయినచోటే వెతుక్కోవాలని అంటారు. నొవాక్ జొకోవిచ్ విషయంలో అదే జరిగింది. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ‘కెరీర్ స్లామ్’ ఘనతను సాధించే అవకాశం దక్కినా ఈ సెర్బియా స్టార్‌కు నిరాశే ఎదురైంది. అయితే నాలుగో ప్రయత్నంలో మాత్రం అనుకున్నది సాధించాడు. గతేడాది తుది సమరంలో వావ్రింకాను తక్కువ అంచనా వేసి బోల్తా పడినా... ఈసారి అలాంటి తప్పిదం చేయలేదు.  ఫైనల్ ప్రత్యర్థి ఆండీ ముర్రేపై స్ఫూర్తిదాయక విజయం సాధించి ‘కెరీర్ స్లామ్’ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రీడాకారుడిగా నిలిచాడు.

 
 
పారిస్: ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ‘ఫ్రెంచ్ ఓపెన్’ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-1, 6-2, 6-4తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీలో 2012, 2014, 2015లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జొకోవిచ్... నాలుగో ప్రయత్నంలో విజేతగా అవతరించి తొలిసారి ‘ఫ్రెంచ్’ చాంపియన్‌గా నిలిచాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ స్లామ్ (టెన్నిస్ సర్క్యూట్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) ఘనతను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఏకకాలంలో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ ఆండీ ముర్రేకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.


తొలిసారి ఫ్రెంచ్ ఫైనల్ ఆడుతున్న ముర్రే తొలి సెట్‌ను నెగ్గడంతో జొకోవిచ్‌కు మరోసారి నిరాశ తప్పదా అనిపించింది. అయితే వెంటనే తేరుకున్న జొకోవిచ్ రెండో సెట్ నుంచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్‌లో జొకోవిచ్ జోరు మరింత పెరిగింది. ఈ సెట్‌లోనూ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నాలుగో సెట్‌లో ముర్రే కాస్త పోటీనిచ్చినా మళ్లీ రెండుసార్లు బ్రిటన్ స్టార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
 
 
అత్యధికంగా 12వ ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్ 11వ ప్రయత్నంలో ఈ టైటిల్ సాధించాడు.

జిమ్ కొరియర్ (అమెరికా-1992లో) తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు.

మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి నాలుగోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్, జెరోస్లావ్ డ్రోబ్నీ మాత్రమే ఇలా చేశారు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సరసన జొకోవిచ్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (14 టైటిల్స్), రాఫెల్ నాదల్ (14 టైటిల్స్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.


 
మళ్లీ నిరాశే...

గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో ముర్రే ఓడిపోవడం ఇది ఐదోసారి. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగుసార్లు ముర్రే ఓడిపోయాడు.
 
‘కెరీర్ స్లామ్’ వీరులు...
 ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్), డాన్ బడ్జ్ (అమెరికా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).


వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేతలు...
డాన్ బడ్జ్ (1938-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), రాడ్ లేవర్ (1962, 1969-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), జొకోవిచ్ (2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్-2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్
 



 1971 తర్వాత ఫ్రాన్స్ జంటకు టైటిల్...

మహిళల డబుల్స్ విభాగంలో మ్లాడెనోవిచ్-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మ్లాడెనోవిచ్-గార్సియా ద్వయం 6-3, 2-6, 6-4తో మకరోవా-వెస్నినా (రష్యా) జోడీపై గెలిచింది. 1971లో గెయిల్ చాన్‌ఫ్రెయు-ఫ్రాంకోయిజ్ దుర్ జంట తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫెలిసియానో లోపెజ్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట గెల్చుకుంది. ఫైనల్లో ఈ జోడీ 6-4, 6-7 (6/8), 6-3తో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయంపై నెగ్గింది. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓ స్పెయిన్ జోడీ ఖాతాలో పురుషుల డబుల్స్ టైటిల్ చేరింది.
 
 
రోలాండ్ గారోస్‌లో తొలిసారి కొత్త అనుభూతికి లోనవుతున్నాను. ఇదో ప్రత్యేక క్షణం. నా కెరీర్‌లోనే అత్యుత్తమం. మా ఫైనల్ చూసేందుకు ఇంత మంది ప్రేక్షకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్టు, మీరు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అందుకే ఈ మట్టిపై నా హృదయం పరుస్తున్నాను. ఇలా బొమ్మ గీసి తనను అనుకరించేందుకు అనుమతి ఇచ్చిన  మాజీ చాంపియన్ గుస్తావో   కుయెర్టన్‌కు కృతజ్ఞతలు. -జొకోవిచ్

మరిన్ని వార్తలు