ఇంగ్లండ్‌కు మరో పరీక్ష

14 Aug, 2019 10:54 IST|Sakshi
స్టీవ్‌ స్మిత్‌, ఆర్చర్‌

లార్డ్స్‌లో నేటి నుంచి యాషెస్‌ రెండో టెస్టు

అరంగేట్రం చేయనున్న పేసర్‌ ఆర్చర్‌

ఊపుమీదున్న ఆస్ట్రేలియా

లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో పరీక్ష. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో బుధవారం నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన ఊపులో యాషెస్‌ బరిలో దిగిన ఆతిథ్య జట్టుకు మొదటి టెస్టులో తలబొప్పి కట్టింది. తమతో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చేలా కనిపించిన ఇంగ్లండ్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను అడ్డుకోలేక చేతులెత్తేసి ఏకంగా 251 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు అసలు ముప్పు స్మిత్‌తోనే. ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ గాయంతో దూరమైనందున యువ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ టెస్టు అరంగేట్రం ఖాయమైంది. దీనికిముందే ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీపై వేటు వేసిన ఇంగ్లండ్‌... 12 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌కు చోటిచ్చింది.

 బ్యాటింగ్‌లో కెప్టెన్‌ జో రూట్‌ పైనే భారం వేసింది. ఓపెనర్లు జాసన్‌ రాయ్, రోరీ బర్న్స్‌లతో పాటు బట్లర్, బెయిర్‌స్టో రాణిస్తేనే ప్రత్యర్థికి సవాల్‌ విసరగలుతుంది. పునరాగమనంలో స్మిత్‌ రెండు శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా లయ అందుకుంటే కంగారూలకు తిరుగుండదు. ఉస్మాన్‌ ఖాజా, ట్రావిస్‌ హెడ్, మాధ్యూ వేడ్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. కమిన్స్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తుండగా, స్పిన్నర్‌ లయన్‌ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. పేసర్‌ ప్యాటిన్సన్‌కు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా... మిషెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్‌లతో 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టెస్టులోనూ ఓడితే సిరీస్‌లో ఇంగ్లండ్‌ పుంజుకోవడం కష్టమే. యాషెస్‌ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్‌ నెగ్గిన సందర్భాలు (1981, 2005) రెండే ఉండటం గమనార్హం. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా