19 ఏళ్ల కుర్రాడి ప్రపంచ రికార్డు

12 Jul, 2013 05:11 IST|Sakshi
19 ఏళ్ల కుర్రాడి ప్రపంచ రికార్డు

సాక్షి క్రీడా విభాగం
 యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు తొలి రోజు...టాస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుండగా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గ్లెన్ మెక్‌గ్రాత్ వారి వద్దకు వచ్చాడు. ఆసీస్ ఆటగాళ్లందరూ అతనితో కరచాలనానికి సిద్ధమయ్యారు. ఇంతలో అనూహ్యంగా మెక్‌గ్రాత్ తన చేతిలోని బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను తీసి 19 ఏళ్ల ఆస్టన్ ఎగర్ చేతిలో పెట్టి అభినందించాడు. అప్పటి వరకు ఎగర్ తొలి మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయం అతని సహచరులకు కూడా తెలియదు! కనీసం ఏడాది పాటు కూడా ఫస్ట్ క్లాస్ క్రి కెట్ ఆడని ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు ఏకంగా యాషెస్‌లో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది.
 
  పిచ్ సీమర్లకు పూర్తిగా అనుకూలించడం, మొదటి మ్యాచ్‌లో సహజంగా ఉండే ఆందోళన... కారణం ఏదైనా కావచ్చు గానీ అతను బౌలర్‌గా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో అతను చూపిన తెగువ ఒక్క సారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పదకొండో స్థానంలో ఆడే ఆటగాడి తరహాలో గుడ్డిగా బ్యాట్ ఊపేయకుండా అతను ఆడిన చక్కటి షాట్లు, సాధికారత అతని ఇన్నింగ్స్‌ను చిరస్మరణీయం చేశాయి. రికార్డు స్కోరుతో యాషెస్‌లో అడుగు పెట్టిన ఎగర్ ఆసీస్ శిబిరంలో ఆశలు రేపాడు.
 
 శ్రీలంక నేపథ్యం....
 మెల్‌బోర్న్‌లో పుట్టిన ఎగర్ మూలాలు శ్రీలంకలో ఉన్నాయి. అతని తాత నలహెవవిస శ్రీలంకలోని క్యాండీలో కాలేజ్ స్థాయిలోనే క్రికెట్ ఆడినా...ఆ కుటుంబానికి అక్కడ చాలా గుర్తింపు ఉంది. అతని పేరుతో ఒక క్రికెట్ టోర్నీ కూడా జరుగుతుంది. వారి కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
 
 అండర్-15, అండర్-17 స్థాయిలో ఎగర్ విక్టోరియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతని నిలకడైన ప్రదర్శన గత ఏడాది ప్రపంచకప్ ఆడిన ఆసీస్ అండర్-19 జట్టులో కూడా చోటు కల్పించింది.  వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున ఈ ఏడాది జనవరిలో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఫిబ్రవరిలో ఆసీస్ జట్టు భారత పర్యటనలో ’డెవలప్‌మెంట్ మెంబర్’ గా ఎగర్‌కు అవకాశం లభించింది. అతని అంకిత భావం చూసి ఆసీస్ బోర్డు ఆ టూర్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఇండియా ‘ఎ’తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఎగర్‌కు అవకాశం ఇచ్చింది.  
 
 వెటోరీతో పోలిక...
 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు పడగొట్టిన ఎగర్‌లో మంచి బ్యాట్స్‌మన్, చురుకైన ఫీల్డర్ కూడా ఉన్నాడు. అదే చీఫ్ సెలక్టర్ జాన్ ఇన్‌వెరారిటీ దృష్టిని ఆకర్షించింది. అందుకే బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్న స్టీవ్ ఓ కీఫ్‌ను కాదని యాషెస్ కోసం ఎగర్‌ను ఎంపిక చేశారు. సెలక్టర్ల నిర్ణయానికి మద్దతుగా అన్నట్లు ఆసీస్ కోచ్ లీమన్ కూడా ఏకంగా తొలి టెస్టు బరిలో దిగే అవకాశం కల్పించాడు. 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన వెటోరీతో ఎగర్‌ను అంతా పోలుస్తున్నారు. అతని బ్యాటింగ్ బలమేమిటో ఇంగ్లండ్ జట్టు రుచి చూసింది. ఇక మిగిలింది బౌలింగ్‌లో సత్తా చాటడమే. వార్న్‌లాంటి దిగ్గజం రిటైరైన తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి అపరిమిత సంఖ్యలో స్పిన్నర్లు వచ్చారు...పోయారు. అలాంటి కోవలో చేరకుండా ఎగర్ తనకు లభించిన గోల్డెన్ చాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. 19 ఏళ్లకే తమ దేశం తరఫున ఆడగలగిన ఈ కుర్రాడు నిలకడైన ఆటతో మెరుగ్గా రాణిస్తే ఆసీస్‌కూ స్పిన్ కష్టాలు తీరినట్లే.
 

మరిన్ని వార్తలు