యాషెస్‌కు వేళాయె...

22 Nov, 2017 01:37 IST|Sakshi

రేపటి నుంచి బ్రిస్బేన్‌లో తొలిటెస్టు

సొంతగడ్డపై రాణించేందుకు కంగారూల వ్యూహం

ఫామ్‌ కొనసాగించాలని ఇంగ్లండ్‌ పట్టుదల

వ్యాఖ్యలతో వేడెక్కిన వాతావరణం  

క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికర పోరుకు రేపటి నుంచి తెరలేవనుంది. దాయాదులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య 2017–18 యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మ్యాచ్‌ గురువారం బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. జో రూట్, స్టీవ్‌ స్మిత్‌ రూపంలో ప్రపంచ టాప్‌ క్రికెటర్లు కెప్టెన్లుగా ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈసారి యాషెస్‌ మరింత ఆసక్తికరం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ జట్టుదే కాస్త పైచేయిగా ఉన్నా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. 2013లో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 0–5తో మట్టికరిపించిన కంగారూలు... 2015లో ఇంగ్లండ్‌ గడ్డపై 2–3తో సిరీస్‌ను కోల్పోయారు. ఈసారి సొంతగడ్డపై లెక్క సరిచేయాలని స్మిత్‌ బృందం భావిస్తోంది. అయితే కొంతకాలంగా స్మిత్‌ జట్టు పేలవమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది భారత పర్యటనలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఆసీస్‌... యాషెస్‌ సిరీస్‌ విజయంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. అటు ఇంగ్లండ్‌ కూడా గత సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.      – సాక్షి క్రీడావిభాగం

ఇంగ్లండ్‌ కూర్పు బాగున్నా...
జో రూట్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు కూర్పు బాగానే ఉన్నప్పటికీ బెన్‌ స్టోక్స్‌ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కుక్, అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, మొయిన్‌ అలీ వంటి అనుభవజ్ఞులకు తోడు యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడుతున్నప్పడు బెన్‌ స్టోక్స్‌ వంటి అద్భుతమైన ఆల్‌రౌండర్‌ అవసరం చాలా ఉంటుంది. తాజా యాషెస్‌ సిరీస్‌ కోసం స్టోక్స్‌ పేరును ఈసీబీ ప్రకటించినప్పటికీ.. ఓ కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని తప్పించాల్సి వచ్చింది. దీంతో అండర్సన్‌ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించాడు.  స్టోక్స్‌ స్థానంలో ఫిన్‌ వచ్చినా... ప్రాక్టీస్‌ గేమ్‌లో అతనూ గాయపడ్డాడు.  కెప్టెన్‌గా తొలి యాషెస్‌ ఆడుతోన్న రూట్‌కు ఈ సిరీస్‌ అత్యంత కీలకం. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ సిరీస్‌లను గెలుచుకుని ఊపు మీదున్న ఇంగ్లండ్‌కు ఈ సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే సిరీస్‌ ‘డ్రా’ చేసుకోగలిగినా ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది.

స్మిత్‌కు సవాల్‌....
సారథిగా తొలి యాషెస్‌ ఆడనున్న స్మిత్‌కు ఈ సిరీస్‌ అత్యంత ప్రతిష్టాత్మకం. ఇటీవలి కాలంలో పరాజయాలతో ఆగ్రహంగా ఉన్న అభిమానులను శాంతింపజేసేందుకు స్వదేశంలో విజయం చాలా అవసరం. హాజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్‌ వంటి వారితో ఆసీస్‌ బౌలింగ్‌ బలంగానే ఉంది. స్మిత్, షాన్‌ మార్‌‡్షలు ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు బలం. ఏడేళ్ల విరామం తర్వాత వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే... ప్రాక్టీస్‌ సందర్భంగా వార్నర్‌ మెడకు గాయమైంది. ఈ వార్త ఆసీస్‌ను కలవరపెడుతోంది.

యాషెస్‌ సిరీస్‌ ఫలితాలు ఆయా దేశాల్లో హీరోలను విలన్లుగా... విలన్లను హీరోలుగా చేస్తాయనేది వాస్తవం. యాషెస్‌ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు యాషెస్‌ ఓటమితో వారి వారి దేశాల్లో రాత్రికిరాత్రే హీరోలుగా లేదా విలన్లుగా మారిన సంఘటనకు కోకొల్లలు. మహామహులైన కెప్టెన్లు సైతం యాషెస్‌ కారణంగా తమ బాధ్యతలను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే యాషెస్‌ ఇరుదేశాలకు అత్యంత ప్రతిష్టాత్మకం.

హైటెన్షన్‌ వాతావరణాన్ని సృష్టించే యాషెస్‌కు ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ప్రతి యాషెస్‌కు ముందు సహజమే అయినా ఈసారి ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ‘ఈ సిరీస్‌ తర్వాత చాలామంది ఇంగ్లండ్‌ ప్లేయర్ల కెరీర్‌లు ముగిసిపోతాయం’టూ లయన్‌ వ్యాఖ్యానించాడు. గత సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టులో జరిగిన మార్పులను ఉదహరించాడు. కంగారూల బౌలింగ్‌ వేగాన్ని చూసి రూట్‌ జట్టు భయపడుతోందన్నాడు.

ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 69 టెస్టు సిరీస్‌లు జరగ్గా... ఇరుజట్లు చెరో 32 సిరీస్‌లను సొంతం చేసుకొని.. ఐదు సిరీస్‌లను డ్రా చేసుకున్నాయి. ‘యాషెస్‌’ మ్యాచ్‌ల విషయానికొస్తే... మొత్తం 341 టెస్టు మ్యాచులు జరగ్గా... ఆస్ట్రేలియా 140, ఇంగ్లండ్‌ 108 మ్యాచుల్లో గెలిచాయి. 93 ‘డ్రా’గా ముగిశాయి. 

మరిన్ని వార్తలు