ఆ బౌలర్‌ చెలరేగితే బ్యాట్స్‌మెన్లకు కష్టమే: నెహ్రా

7 Nov, 2017 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20తో రిటైరైన భారత క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా ఓ ఆస్ట్రేలియా బౌలర్‌కు తన మద్ధతు తెలిపాడు. 2013–14 సీజన్లో మిచెల్‌ జాన్సన్‌ (37 వికెట్లు) సహా ఆసీస్‌ పేసర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌పై కంగూరులు తమ సొంతగడ్డపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే తీరుగా ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ చెలరేగితే విజయం కంగూరులదేనని భారత మాజీ క్రికెటర్‌ నెహ్రా అంటున్నాడు. స్వదేశంలో సిరీస్‌ జరగనుండటం ఆసీస్‌ పేసర్లకు మరింత కలిసొచ్చే అంశమన్నాడు. స్టార్క్‌ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవని, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లపై కచ్చితంగా భారం పడనుందని అభిప్రాయపడ్డాడు

ఒకవేళ స్టార్క్‌ ఆ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడగలిగితే.. కనీసం 30 వికెట్లు తీసి సత్తా చాటుతాడని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. గాయాలతో సతమతవుతున్న స్టార్క్‌ జట్టులోకి రావడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశంకాగా, వివాదాలతో ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరం కావడం ఇంగ్లండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో మిచెల్ స్టార్క్ తో కలిసి హజల్ వుడ్ ఆసీస్‌ ఓపెనింగ్ బౌలింగ్ ను పంచుకునే అవకాశం ఉంది. వీరికి జతగా మరో పేసర్ ప్యాట్ కమిన్స్ కూడా అందుబాటులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు