ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు

5 Apr, 2020 20:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ చరిత్రలో ఎంఎస్‌ ధోనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ధోని గురించి అడగ్గానే అత్యుత్తమ వికెట్‌కీపింగ్‌ నైపుణ్యం, బెస్ట్‌ ఫినిషింగ్‌, విజయవంతమైన సారథి అని అందరూ చెబుతారు. కానీ అతడు భారత క్రికెట్‌లో ఓవర్‌ నైట్‌ స్టార్‌ కాలేదు. ఛీవాట్ల నుంచి మొదలైన అతడి ప్రయాణం కీర్తించే స్థాయికి వెళ్లింది. ఆటకు దూరమై 8 నెలలు కావస్తున్నా అతడు లేకుండా క్రికెట్‌ వార్త ఉండటం లేదు.. కోహ్లి నుంచి ప్రతీ యువక్రికెటర్‌ ధోని జపం వదడం లేదు. ఈ క్రమంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ధోని గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

‘ధోని క్రికెట్‌ కెరీర్‌ అంతగొప్పగా అయితే ప్రారంభం కాలేదు. అటు బ్యాటింగ్‌లో ఇటు వికెట్‌ కీపింగ్‌లో వైఫల్యం చెందాడు. అయితే అతడు ఏ సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది. సెంచరీతో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. టీమిండియాలోకి వచ్చినప్పుడు అతడు బెస్ట్‌ కాదు. కీపింగ్‌లో ధోని కంటే ముందు నయాన్‌మోంగియా, కిరన్‌ మోరెలు తమ అత్యుత్తమ కీపింగ్‌ నైపుణ్యంతో ఓ బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేశారు. అయితే ఆటపై ధోనికి ఉన్న క్రమశిక్షణ, ఇష్టం, ప్రశాంతత, విశ్వాసం అతడిని గొప్పవాడిని చేశాయి. దినేశ్‌ కార్తీక్‌, పార్థీవ్‌ పటేల్‌లకు అనేక అవకాశాలు వచ్చాయి. కానీ వారు సద్వినియోగం చేసుకోలేరు. ఇదే క్రమంలో ధోని వారిద్దరి కంటే మెరుగని నిరూపించుకున్నాడు. మామూలు వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా వచ్చి అత్యుత్తమ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 

నాకు మైక్‌ బ్రెయర్లీ, ఇమ్రాన్‌ఖాన్‌, అర్జున్‌ రణతుంగల గురించి తెలియదు. నా 22 ఏళ్ల క్రికెట్‌ ప్రయాణంలో సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనిలు నాకు నచ్చిన, అత్యుత్తమ సారథులు. వారికి ఏం చేయాలో తెలుసు, సహచర క్రికెటర్ల నుంచి అత్యుత్తమ ఆటను ఎలా రాబట్టాలో తెలుసు. లభించిన అవకాశాలను జట్టుకు ఉపయోగపడేలా ఎలా సద్వినియోగం చేసుకోవాలో గంగూలీ, ధోనిలకు బాగా తెలుసు. ఇక 2009లో టెస్టుల్లోకి పునరాగమనం చేయాలని ధోని కోరాడు. కానీ ధోని విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాను. ధోనిని చూసినప్పుడల్లా ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తికి అవకాశం లభించి సద్వినియోగం చేసుకున్నాక అతడిని వెనక్కి లాగడం కష్టం అనే సత్యం రుజువైంది’అని నెహ్రా పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు