‘నా భార్య, కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’

29 Apr, 2019 17:24 IST|Sakshi

బెంగళూరు : భారత పేసర్‌ అశోక్‌ దిండాను హేళన చేస్తూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్‌లో చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది.ఆర్సీబీ ట్వీట్‌, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్‌లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్‌.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేస్తూ ఆర్సీబీకి గట్టి కౌంటరే ఇచ్చాడు.

అయితే తాను అంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో అశోక్‌ దిండా వివరణ ఇచ్చాడు. ‘ ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్‌తో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. మామూలుగా అయితే నేను వాటికి రియాక్ట్‌ కావాల్సిన అవసరం లేదు. కానీ ఆర్సీబీ చేసిన ట్వీట్‌తో నా భార్య, నా కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్‌ చేశారు. వాడకూడని, వినకూడని భాషతో దూషించారు. కూతుర్ని ఎవరైనా దూషిస్తే బాధ్యత గల తండ్రి ఎవరూ కూర్చొని చూస్తూ ఉండడు. అందుకే ఆర్సీబీ చేసిన ట్వీట్‌కు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అసలు ఆర్సీబీ ఒక ఫ్రాంచైజీ అంటే అనుమానం వస్తుంది. ఒక ఆటగాడ్ని కించపరుస్తూ బాధ్యతలేకుండా ప్రవర్తించిన ఆర్సీబీ ఫ్రాంచైజీగా ఉండేందుకు అర్హత ఉందా’ అని దిండా మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు