తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్నకు తీవ్ర గాయం

18 Nov, 2019 11:25 IST|Sakshi

కారెన్‌ రోల్టన్‌ ఓవల్‌: ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మార్ష్‌ వన్డే కప్‌లో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్‌ అగర్‌.. తమ్ముడు వెస్‌ అగర్‌ షాట్‌ను క్యాచ్‌ రూపంలో అందుకునే క్రమంలో గాయపడ్డాడు. సౌత్‌ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న వెస్‌ ఆగర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క‍్రమంలో 41 ఓవర్‌ను మార్కస్‌ స్టోయినిస్‌ వేశాడు. ఆ ఓవర్‌లో వెస్‌ అగర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ కొట్టగా అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఆస్టన్‌ దాన్ని అందుకోవడానికి యత్నించాడు. ఆ బంతి కాస్త జారడంతో కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.

దాంతో ఫీల్డ్‌ను విడిచి వెళ్లిపోయాడు ఆస్టన్‌. రక్తంతో తడిచిన ముఖంతోనే మైదానాన్ని వీడగా ఆగర్‌ తిరిగి బరిలోకి దిగలేదు. ఈ టోర్నీకి ఆస్టన్‌ అగర్‌ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్లు సూచించగా అందుకు అగర్‌ నిరాకరించాడు. ప్లాస్టిక్‌ సర్జన్‌ ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే కుట్లుకు ఆస్టన్ నిరాకరించాడు.

ఈ ఘటనపై తమ్ముడు వెస్‌ అగర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇలా జరగడం బాధాకరమన్నాడు. గాయపడ్డ మరుక్షణం అతని ఆరోగ్యం గురించి కలత చెందానన్నాడు. దాంతోనే క్రీజ్‌ను వదిలి హుటాహుటీనా అన్న ఆస్టన్‌ దగ్గరకు వెళ్లానన్నాడు. ఈ గాయంతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలపడంతో ఉపశమనం పొందానన్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

>
మరిన్ని వార్తలు