అశ్విన్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

29 Aug, 2019 11:46 IST|Sakshi

జమైకా:  మూడేళ్ల క్రితం వెస్టిండీస్‌లో భారత పర్యటించినప్పుడు ఆఫ్‌ స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ 17 వికెట్లు సాధించి సత్తాచాటాడు. ఓవరాల్‌గా విండీస్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 60 వికెట్లు సాధించాడు.  అయితే ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. విండీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న అశ్విన్‌కు చోటివ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. విండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ అశ్విన్‌ వంటి సీనియర్‌ స్పిన్నర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్లు ప్రశ్నించారు. దాంతో రెండో టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ క్రమంలోనే అశ్విన్‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లను చేరుకునేందుకు అశ్విన్‌ ఎనిమిది వికెట్ల దూరంలో నిలిచాడు. రేపటి నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులో అశ్విన్ ఆడి, ఎనిమిది వికెట్లు సాధిస్తే స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును సమం చేస్తాడు. అశ్విన్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకూ 65 టెస్టు మ్యాచ్‌లు ఆడి 342 వికెట్లను సాధించాడు. అయితే మురళీ ధరన్‌ 350 వికెట్లను 66 మ్యాచ్‌ల్లో సాధించి ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు మురళీధరన్‌ సరసన నిలిచేందుకు అశ్విన్‌కు విండీస్‌తో రెండో టెస్టు అరుదైన అవకాశ‍మనే చెప్పాలి.

మరిన్ని వార్తలు