అశ్విన్ మరో రికార్డు

5 Mar, 2017 12:40 IST|Sakshi
అశ్విన్ మరో రికార్డు

బెంగళూరు: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ మ్యాచ్  తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ సంధించిన బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు.. తద్వారా 12 టెస్టుల్లో ఎనిమిదిసార్లు అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అవుటయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్ లో ఒకే ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించాడు. కాగా, అదే సమయంలో ఇక్కడ వార్నర్ కూడా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఒకే బౌలర్ కు తన వికెట్ ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రథను సైతం వార్నర్ సొంతం చేసుకోవడం ఇక్కడ గమనార్హం.



ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా అశ్విన్ వేసిన 22.0 ఓవర్ తొలి బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు.  అశ్విన్ వేసిన ఆ బంతి లెగ్ స్టంప్ బయటపడి ఊహించని విధంగా వార్నర్ ఆఫ్ స్టంప్ ను ఎగరేసుకుపోయింది.దాంతో ఆస్ట్రేలియా  52 పరుగుల వద్ద తొలి వికెట్ ను నష్టపోయింది. 40/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆదిలో భారత బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడింది. ప్రధానంగా అశ్విన్ బౌలింగ్ ను ఆచితూచి ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ వార్నర్ (33) ను అశ్విన్ పెవిలియన్ కు పంపి మంచి ఆరంభాన్నిచ్చాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.