'ఆ సపోర్ట్‌ భజ్జీ కంటే కూడా అశ్విన్‌కే ఉంది'

30 Nov, 2017 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఎనిమిది వికెట్లతో ఆకట్టుకున్న భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ మూడొందల టెస్టు వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్‌ గా రికార్డు సాధించాడు. ఒక ఆఫ్‌ స్పిన్నర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తనదైన మార్కును చూపెడుతున్న అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర‍్షం కురుస్తోంది. తాజాగా అశ్విన్‌ ను ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ కొనియాడుతూ.. మరో నాలుగైదేళ్ల పాటు అతను ఆడితే క్రికెట్‌ గ్రేట్‌ జాబితాలో చేరిపోవడం ఖాయమన్నాడు. అయితే  ఆఫ్‌ స్పిన్నర్లతో పోలిస్తే అశ్విన్‌ కంటే కూడా హర్భజనే అత్యంత ప్రభావం చూపిన బౌలర్‌గా హేడెన్‌ అభివర‍్ణించాడు.

'అశ్విన్‌ ఒక గొప్ప స్పిన్నర్‌.. అందులో ఎటువంటి సందేహం లేదు. మూడొందల టెస్టు వికెట్లను వేగవంతంగా సాధించిన అశ్విన్‌ నిజంగా అభినందనీయుడే. హర్బజన్‌ తరహాలో అశ్విన్‌ కూడా ఒక స్పిన్‌ మాస్టర్‌. కాకపోతే అశ్విన్‌లో హర్భజన్‌ వంటి దూకుడు లేదు. హర్బజన్‌ ఆడే రోజుల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించేవాడు. ప‍్రధానంగా మాతో జరిగిన మ్యాచ్‌ల్లో హర్భజన్‌ ఆడకపోతే భారత జట్టు ఇబ్బందుల్లో పడేది. ఆ సమయంలో భారత విజయాల్ని హర్భజన్‌ భుజ స్కందాలపై మోసేవాడు. ఆనాడు హర్భజన్‌కు సరైన ఫాస్ట్‌ బౌలింగ్‌ సపోర్ట్‌ లేదు. ఇప్పుడు అశ్విన్‌ కు చక్కటి ఫాస్ట్‌ బౌలింగ్‌ సహకారం మెండుగా ఉంది. ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో మొహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, బూమ్రా వంటి పేసర్లు ఉన్నారు.  వీరంతా అశ్విన్‌ తన పని తాను చేసుకుపోవడానికి ఉపయోగపడుతున్నారు. దాంతో ఫాస్ట్‌ బౌలర్ల సహకారం హర్భజన్‌ కంటే కూడా అశ్విన్‌కు ఉందనే చెప్పాలి. ఈ కారణం చేత భజ్జీ తరహాలో దూకుడైన బౌలింగ్‌ అశ్విన్‌ కు అవసరం లేదు'అని హేడెన్‌ విశ్లేషించాడు.

మరిన్ని వార్తలు