ట్రాఫిక్‌ పోలీస్‌ ‘మన్కడింగ్‌’ 

28 Mar, 2019 00:56 IST|Sakshi

బట్లర్‌ను ‘మన్కడింగ్‌’ ద్వారా అశ్విన్‌ ఔట్‌ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్‌ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్‌ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్‌ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.

ఎందుకంటే 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్‌ కారణంగా బతికిపోయిన ఫఖర్‌ జమాన్‌ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్‌ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. 
 

మరిన్ని వార్తలు