అశ్విన్‌ను వెనకేసుకొచ్చిన ద్రావిడ్‌

27 Mar, 2019 16:45 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019లో ‘మన్కడింగ్‌’ తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ విధానం ద్వారా ఔట్‌ చేశాడు. దీంతో అశ్విన్‌ క్రీడా స్పూర్తి మరిచాడంటూ ఐపీఎల్‌ అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా అతడి వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే అశ్విన్‌కు మురళీ కార్తీక్‌, బీసీసీఐ మద్దతు తెలపగా.. తాజాగా అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా అశ్విన్‌కు బాసటగా నిలిచాడు. అశ్విన్‌  ఎవర్నీ మోసం చేయలేదని.. తన పరిమితులకు లోబడే మన్కడింగ్‌ చేశాడని, అతడిపై విమర్శలు చేయడం సరికాదని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

అయితే మన్కడింగ్‌ చేసే ముందు బ్యాట్స్‌మన్‌ను ఒక్కసారైనా హెచ్చరించి ఉండాల్సిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా అశ్విన్‌ తన హద్దులకు లోబడే ప్రవర్తించాడని పేర్కొన్నాడు . ఈ చర్యతో అతడి వ్యక్తిత్వానికి అగౌరవపరచడం తగదన్నాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, అదే విధంగా ఇతరుల మనోభావాలను గౌరవిస్తానని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ 67 పరుగులతో ఆ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్న వేళ.. అశ్విన్‌ మన్కడింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బట్లర్‌ నిష్ర్కమణ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పంజాబ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు విఫలమైంది. ఇక ద్రవిడ్‌ గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు