ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత..

24 Jul, 2018 13:23 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా స్పిన్నర్ ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ మరోసారి బరిలో దిగనున్నాడు. గతంలో వర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ మరోసారి ఆ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ పర్యటనలో భాగంగా విరాట్‌ సేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. భారత టెస్టు జట్టులో అశ్విన్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అశ్విన్ వర్సెస్టర్‌షైర్‌ తరపున ఆడనున్నాడు. ఈ ఒప్పందానికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటీ చాంపియన్ షిప్‌ -2018లో భాగంగా సెప్టెంబర్‌లో ఎసెక్స్, యార్క్‌షైర్ జట్లతో జరగనున్న కీలక మ్యాచ్‌ల్లో అశ్విన్ ఆడనున్నాడు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ వెయిన్ పార్నెల్ స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. గత సీజన్‌లో అశ్విన్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్ 20 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.

‘కచ్చితంగా అశ్విన్ రాకతో జట్టుకు భారీ లాభం చేకూరనుంది. మా జట్టు మంచి విజయాలు సాధించేందుకు గతేడాది వేసవి సీజన్‌లో అద్భుతంగా రాణించాడు’ అని ఆ జట్టు కోచ్ కెవిన్ షార్ప్  పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు