ప్లాన్ AB

1 Dec, 2015 02:55 IST|Sakshi
ప్లాన్ AB

స్పిన్ ఉచ్చులో పడ్డ డివిలియర్స్
 
ఏ జట్టుకైనా, ఏ విషయంలో అయినా రెండు ప్రణాళికలు ఉంటాయి. ప్లాన్ ఎ విఫలమైతే వెంటనే ప్లాన్ బి అమల్లోకి తెస్తారు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ముందు ఇలాంటి ప్లాన్‌లు పనికిరావు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి షాట్ ఆడతాడో తెలియకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు. వన్డే సిరీస్‌లో డివిలియర్స్ ప్రతాపం చూసిన తర్వాత... టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై గెలవాలంటే డివిలియర్స్‌ను  పూర్తిగా కట్టడి చేయాలని భారత్‌కు అర్థమైంది.
 
ఎలాగూ స్పిన్ పిచ్‌లే సిద్ధంగా ఉన్నాయి. అయినా డివిలియర్స్‌ను ఆపాలంటే స్పిన్నర్లకూ ఓ వ్యూహం ఉండాలి. లేకపోతే కష్టం. అందుకే భారత స్పిన్ త్రయం డివిలియర్స్‌కు ‘ప్లాన్ ఏబీ’ సిద్ధం చేసింది. దానిని విజయవంతంగా అమలు చేసి సఫారీల వెన్నెముకను కట్టడిచేసింది.
 

సాక్షి క్రీడా విభాగం: నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు డకౌట్ అయిన తర్వాత ‘చాలా కఠినమైన రోజు ఇది. అయితే ఇక్కడ ఎలా ఆడాలనే దానికి పరిష్కారం దొరికింది’ అని ఏబీ డివిలియర్స్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో అతను భిన్నంగా ఆడబోతున్నాడనేది మాత్రం అర్థమైంది. నిజంగానే స్టాన్స్ మార్చి ఏబీ భిన్నంగా ఆడేందుకు ప్రయత్నించాడు. అశ్విన్ బౌలింగ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న అతను... ఎక్కువ భాగం ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు.

ఎల్బీడబ్ల్యూల నుంచి తప్పించుకునేందుకు... స్వీప్ ఆడినా వికెట్లు వదిలేశాడు. ఒకసారి చాలా ముందుకొచ్చి భారీ షాట్‌కు కూడా ప్రయత్నించినా విఫలమయ్యాడు. సాధ్యమైనంత వరకు దూకుడుగా ఆడి అశ్విన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తే తర్వాత చెలరేగవచ్చని భావించినట్లున్నాడు. అయితే ఈ జోరులో అతను అశ్విన్ చేతి నుంచి సిరీస్‌లో తొలిసారి వచ్చిన ‘క్యారమ్ బాల్’ విషయంలో అంచనా తప్పాడు.

ఫలితంగా అంతసేపూ క్రీజ్‌లో వెనక్కి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడిన ఏబీ ‘ఇంజినీర్’ తెలివితేటలకు వికెట్ల ముందు దొరికిపోయాడు. ‘ఈ పర్యటన మొత్తంలో నేను అతనికి ఒక్క క్యారమ్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి పిచ్‌పై క్రీజ్ నుంచి దూరంగా విసురుతూ లోపలికి వచ్చేలా ప్రయత్నించాను. అదో అద్భుతమైన బంతి. నిజాయితీగా చెప్పాలంటే మేం పన్నిన ఉచ్చులో అతను చిక్కాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
 
టి20ల నుంచే...
దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఆమ్లా, డు ప్లెసిస్, డుమినిలాంటి ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఈ సిరీస్‌లో డివిలియర్స్ కీలకం అవుతాడని అందరూ అంచనా వేశారు. స్పిన్‌ను బాగా ఆడటంతో పాటు ఇక్కడ అందరికంటే ఎక్కువ క్రికెట్ అనుభవం కూడా అతని ఖాతాలో ఉంది. పైగా భారత్‌లో సిరీస్‌కు అడుగు పెట్టక ముందు అతను అటు టెస్టులు, ఇటు వన్డేల్లో కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నాడు.

దాంతో టీమిండియా ప్రధాన లక్ష్యం అతనే అయ్యాడు. రెండు టి20 మ్యాచ్‌లలోనూ అశ్విన్ బౌలింగ్‌లోనే డివిలియర్స్ బౌల్డ్ అయ్యాడు. రెండు సార్లూ ఫ్రంట్ ఫుట్‌పై ఆడే ప్రయత్నంలోనే వెనుదిరిగాడు. అప్పటి వరకు అతని కదలికలను గుర్తిస్తూ కెప్టెన్ ధోని చేసిన సూచనలను అశ్విన్ సమర్థంగా అమలు చేయగలిగాడు. అనంతరం కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన డివిలియర్స్ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఆ తర్వాత అశ్విన్ గాయంతో వెనుదిరగడంతో తర్వాతి నాలుగు వన్డేల్లో అతనికి భారత ఆఫ్ స్పిన్నర్ నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు.
 
ముగ్గురూ కలిసి...
టెస్టు సిరీస్‌లో అశ్విన్‌కు అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా తోడయ్యారు. మొహాలీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిశ్రా సాధారణంగా వేసే బంతికంటే నెమ్మదిగా వేయడంతో అంచనా తప్పిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో బంతి టర్న్ కాకపోవడంతో భంగ పడ్డాడు. బెంగళూరు టెస్టులోనైతే ఏబీ పూర్తిగా దూకుడు మంత్రం పాటించాడు. తొలి టెస్టు అనుభవంతో అతి జాగ్రత్తకు పోకుండా ఎదురుదాడికి ప్రయత్నించాడు.

జడేజా బౌలింగ్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన అతను అదే జోరులో వికెట్ ఇచ్చాడు. ఈసారి భిన్నంగా ప్రయత్నించిన జడేజా, మరోసారి షాట్‌కు ప్రయత్నించేలా కవ్వించాడు. ముందుకొచ్చి ఆడబోయిన అతను అక్కడే లెగ్‌సైడ్ బంతి గాల్లోకి లేపాడు. మూడో టెస్టులోనూ జడేజా దాదాపు అదే మంత్రం ప్రయోగించాడు. దాంతో ఆఫ్‌సైడ్ బంతిని లెగ్ మీదుగా ఆడి నేరుగా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనైతే అశ్విన్ అద్భుతం అతడిని పెవిలియన్ చేర్చింది. టి20ల అనంతరం ‘రెండు మ్యాచ్‌లలోనూ అశ్విన్ నన్ను అవుట్ చేయడంకంటే నేను అవుట్ అయ్యానని చెప్పడమే సరైంది. నాలో సాంకేతిక లోపాలు లేవు. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నంలోనే వెనుదిరిగాను’ అని గట్టిగా చెప్పిన ఏబీ... టెస్టుల్లో మాత్రం ఆ పని చేయలేకపోయాడు. ఇక సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందైనా డివిలియర్స్ ప్రత్యేక సన్నాహకంతో సిద్ధమై వస్తాడా లేక మరోసారి అలాగే అవుటవుతాడా చూడాలి.

మరిన్ని వార్తలు