నాణ్యమైన క్రికెటర్లుగా ఎదగాలంటే...

7 Nov, 2019 10:05 IST|Sakshi

మౌలిక వసతులే కీలకమన్న రవిచంద్రన్‌ అశ్విన్‌

గాడియం స్పోర్టోపియా క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన భారత క్రికెటర్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదగాలంటే క్రికెటర్లకు మౌలిక వసతులతో కూడిన మైదానాలు అందుబాటులో ఉండాలని భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాడియం స్పోర్టోపియా క్రికెట్‌ అకాడమీని అశి్వన్‌ బుధవారం ప్రారంభించాడు. చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ‘గాడియం’ స్కూల్‌ గాడియం స్పోర్టోపియా పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సొంత క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనికోసం భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చెందిన జెన్‌–నెక్ట్స్‌ క్రికెట్‌ ఇన్‌స్టిట్యూట్‌తో గాడియం జతకట్టింది.

బుధవారం ఈ అకాడమీ ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ అక్కడి విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. ఎగ్జిబిషన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడి విద్యార్థులకు క్రికెట్‌ మెళకువలు నేరి్పంచాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘చిన్నారులకు అద్భుతమైన మౌలిక వసతులతో పాటు వినూత్న పద్ధతిలో శిక్షణ అందిస్తే భవిష్యత్‌లో వారు నాణ్యమైన క్రికెటర్లుగా ఎదుగుతారు. గాడియం స్పోర్టోపియా ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా అకాడమీని ఏర్పాటు చేసింది. వీరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ అకాడమీలోని మైదానం ఫిరోజ్‌షా కోట్లా గ్రౌండ్‌కు మించిన వైశాల్యంతో ఉండటం విశేషం. ప్రాక్టీస్‌ కోసం 12 నెట్‌లతో పాటు 3 టర్ఫ్, 3 ఆస్ట్రో, 3 మ్యాటింగ్, 3 సిమెంట్‌ వికెట్‌లను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

వీటితో పాటు మూడు ఇండోర్‌ నెట్‌లు, 2 బౌలింగ్‌ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి వెయ్యి మంది మ్యాచ్‌ల్ని చూసేందుకు వీలుగా సీట్లను అమర్చారు. ఇప్పటికే బ్యాడ్మింటన్, చెస్, టేబుల్‌ టెన్నిస్, బాస్కెట్‌బాల్, రోలర్‌ స్కేటింగ్‌ క్రీడల్లో అకాడమీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్ని క్రీడల వైపు మళ్లిస్తోన్న గాడియం వారి జాబితాలో క్రికెట్‌ను కూడా జతచేసిందని స్పోర్టోపియా వ్యవస్థాపకురాలు, డైరెక్టర్‌ కీర్తి రెడ్డి అన్నారు. 2020 నాటికి 180 కోట్ల బడ్జెట్‌తో 25 స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె చెప్పారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు