జైత్రయాత్ర కొనసాగాలి

25 Sep, 2018 02:58 IST|Sakshi

నేడు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌

మిడిలార్డర్‌కు ప్రాక్టీస్‌ 

జైత్రయాత్ర  కొనసాగాలి

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో దుమ్మురేపుతున్న భారత్‌ ఆసియా కప్‌లో మరో విజయంపై కన్నేసింది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని టీమిండియా... మంగళవారం జరిగే సూపర్‌–4 పోరులో అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. వరుస విజయాలతో ఫైనల్‌ చేరిన భారత్‌కు, రేసులో లేని అఫ్గాన్‌కు ఇది నామమాత్రమైన పోరు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్‌కు పోయేది, గెలిస్తే అఫ్గాన్‌కు వచ్చేదీ ఏమీ లేదు. అయితే ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌ భారత్‌కు ఉపయోగపడుతుంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు అవకాశముంటుంది. మరోవైపు సూపర్‌–4లో ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిన అఫ్గానిస్తాన్‌ విజయంతో ఊరట పొందాలని  చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమే అయినా భారత్‌పై సత్తాచాటేందుకు అఫ్గాన్‌ తహతహలాడుతోంది. 

బెంబేలెత్తించే బౌలింగ్‌... 
ఒక్క హాంకాంగ్‌తో మ్యాచ్‌లోనే భారత బౌలింగ్‌ గతి తప్పింది. అయితే ఆలస్యంగానైనా ఆ జట్టు పని పట్టారు భారత బౌలర్లు. ఆ తర్వాత ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటింగ్‌ వెన్నువిరిచారు. దీంతో భారత్‌ భారీ విజయాలను సాధిస్తూ వచ్చింది. ఈ టోర్నీలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు నిలకడగా బౌలింగ్‌ చేశారు. పాకిస్తాన్‌ను రెండుసార్లు కట్టడి చేశారు. బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అందరికంటే మెరుగ్గా బుమ్రా సగటున 3.37 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీయగా, భువనేశ్వర్‌ 4.08 సగటుతో 6 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లిద్దరూ ఐదేసి వికెట్లు చేజిక్కించుకున్నారు. చాన్నాళ్ల తర్వాత వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రభావం చూపాడు. 

మిడిలార్డర్‌పై దృష్టి... 
భారత టాపార్డర్‌ జోరు అసాధారణం. ఓపెనర్లు శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునీయలు చేస్తున్నారు. మరీ ప్రత్యేకించి శిఖర్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. రెండు సెంచరీలతో 327 పరుగులు చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ సెంచరీ, అర్ధసెంచరీలతో 269 పరుగులు చేశాడు. వీరిద్దరి ప్రదర్శనతో మిడిలార్డర్‌కు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. వీళ్లలో అంబటి రాయుడు (116 పరుగులు) కాస్త ఎక్కువగా క్రీజ్‌లో నిలిచాడు. ఓపెనర్ల ప్రదర్శనతో మిగతావాళ్లలో ఎవరూ ఆ మాత్రం ఆడే అవకాశం పొందలేకపోయారు. ఈ టోర్నీలో లీగ్, సూపర్‌–4లో భారత్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లాడినా... దినేశ్‌ కార్తీక్‌ 78 బంతులు, ధోని 40 బంతులు,  కేదార్‌ 27 బంతులే ఎదుర్కొన్నారు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అయిన వీరు ఎదుర్కొన్న బంతులు  తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌ ఏమంత గట్టి ప్రత్యర్థి కాదు కాబట్టి మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకొని రాణించే వీలు ఈ ప్రాక్టీస్‌ కల్పిస్తుంది. ఫైనల్లో అందరూ బ్యాట్‌ ఝళిపించేందుకు అవకాశముంటుంది. బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్‌ మాజీ కెప్టెన్‌ ధోనికి ఇలాంటి చాన్సే ఇచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాడు. ప్రయోగాత్మకంగానైనా మిడిలార్డర్‌కు ప్రమోషన్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.  

ఆకట్టుకున్న అఫ్గాన్‌... 
ఈ టోర్నీలో నిష్క్రమణకు సిద్ధమైన అఫ్గానిస్తాన్‌ ఓవరాల్‌గా ఆకట్టుకుంది. ఆదివారం బంగ్లాదేశ్‌ను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇదే ఉత్సాహంతో ఇపుడు అజేయమైన భారత్‌ను ఓడించి టోర్నీని విజయంతో ముగించాలని ఆశిస్తుంది. ప్రస్తుత అఫ్గాన్‌ జట్టు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమతౌల్యంతో ఉంది. టాపార్డర్‌లో షహజాద్, ఎహ్‌సానుల్లా, హష్మతుల్లా స్థిరంగా ఆడుతున్నారు. కెప్టెన్‌ అస్గర్, నబీ కూడా బ్యాటింగ్‌ భారాన్ని సమర్థంగా మోస్తున్నారు. బౌలింగ్‌లో అదరగొడుతున్న రషీద్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా ఆదుకుంటున్నాడు. ముజీబ్, ఆలమ్‌ నైబ్‌లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పెట్టగల సమర్థులు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ను ఓడించేందుకు ఈ ప్రదర్శన సరిపోదనే చెప్పాలి. సర్వశక్తులు ఒడ్డినా... ప్రతిఘటించగలదేమో కానీ ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోవచ్చు.  


►మరో నాలుగు వికెట్లు తీస్తే భువనేశ్వర్‌ కుమార్‌ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.  
►సాయంత్రం 5 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు