ఫలితాన్ని ఊహించడం కష్టం 

23 Sep, 2018 01:25 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ఆసియా కప్‌లో భారత జట్టు మంచి నియంత్రణతో ముందుకు సాగుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అనామక హాంకాంగ్‌పై చెమటోడ్చి గెలిచాక జట్టు దృక్పథంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. పేసర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేస్తుండటంతో... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ సులువుగా షాట్లు ఆడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక స్పిన్నర్లు ఊరించే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నారు. కేదార్‌ జాదవ్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌తో ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇలాంటి బౌలింగ్‌ దాడికి జడేజా తోడవడంతో సెలక్టర్లకు జట్టు ఎంపికలో మరింత వెసులుబాటు కల్పించినట్లైంది. ఇక్కడి పిచ్‌లపై స్లో బౌలర్లు మరింత ప్రభావం చూపుతారని గుర్తించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వారిని చక్కగా వినియోగించుకుంటున్నాడు. టెస్టు జట్టు నుంచి తనను పక్కనపెట్టడం తప్పని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తూ... తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు.
 

రోహిత్‌–ధావన్‌ జంట ప్రపంచంలోనే విధ్వంసక ఓపెనింగ్‌ జోడీ. ఈ ఇద్దరు పరస్పర సమన్వయంతో ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఆడుతున్నారు. మూడో స్థానంలో రాయుడు ఆకట్టుకుంటుంటే... నాలుగో స్థానం ధోని, కార్తీక్‌ల మధ్య మారుతూ వస్తోంది. అఫ్గానిస్తాన్‌పై చివరి క్షణాల్లో సాధించిన విజయం పాక్‌ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో గెలవడం జట్టుకు బలాన్నిస్తుంది. భారత్, అఫ్గాన్‌లతో మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు శుభారం భాలు లభించలేదు. వరుస మ్యాచ్‌ల వైఫల్యాల తర్వాత నేటి మ్యాచ్‌లో ఫఖర్‌ జమాన్‌ చెలరేగాలని ఆ జట్టు ఆశిస్తుంది. అదే జరిగితే రోహిత్‌ సేనకు కష్టాలు తప్పకపోవచ్చు. అనుభవం ఎంత మేలు చేస్తుందో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో షోయబ్‌ మాలిక్‌ మరోసారి నిరూపించాడు. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే టీమిండియా ఇదివరకంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ఇది భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు. ఈ మ్యాచ్‌లో కచ్చితమైన ఫలితాన్ని ముందుగా ఎవరూ ఊహించలేరు.   

మరిన్ని వార్తలు