పీసీబీకి షాక్‌.. ఆసియాక‌ప్ వాయిదా

9 Jul, 2020 20:21 IST|Sakshi

ఢిల్లీ : ఆసియాక‌ప్ నిర్వ‌హిద్దామ‌నుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గ‌ట్టి షాక్ ఇచ్చింది. క‌రోనా నేప‌థ్యంలో ఆసియా‌ క‌ప్ నిర్వహణ సాధ్యం కాదంటూ జూన్ 2021కి వాయిదా వేస్తున్న‌ట్లు గురువారం నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం ఏసీసీ ప్ర‌క‌టించింది. 2021లో నిర్వ‌హించ‌నున్న ఆసియాక‌ప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది.  కాగా ఏసీసీ స‌మావేశానికి ఒక‌రోజు ముందే బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఒక మీడియా చానెల్‌తో మాట్లాడుతూ క‌రోనా దృష్యా ఆసియా క‌ప్ ర‌ద్దు కానుందని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. గంగూలీ చేసిన వాఖ్య‌ల‌ను నిజం చేస్తూ ఆసియా క‌ప్‌ను వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం.
(చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ)

కాగా అంత‌కముందు గంగూలీ వ్యాఖ్యల‌ను ఖండిస్తూ  పీసీబీ మీడియా డైరెక్టర్‌ శామ్యూల్‌ హసన్ ఘాటుగా స్పందించారు. గంగూలీ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్‌ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అని తెలిపారు. అయితే ముందుగా అనుకున్న ప్ర‌కారం ఆసియా క‌ప్‌ను పాక్ నిర్వ‌హించాల్సి ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా నేప‌థ్యంలో పీసీబీ సెప్టెంబ‌ర్‌లో టోర్నీని నిర్వ‌హించాల‌నుకుంది. ఒక‌వేళ ప‌రిస్థితులు అనుకూలిస్తే శ్రీలంకలో ఆసియా క‌ప్‌ను నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, శ్రీలంక‌లో  సాధ్యం కాక‌పోతే యూఏఈలో టోర్నీని నిర్వ‌హిస్తామ‌ని గ‌తంలో పీసీబీ ఛైర్మ‌న్ వసీం ఖాన్ స్ప‌ష్టం చేశారు.  అయితే జూన్ 2021లో నిర్వ‌హించ‌నున్న ఆసియాక‌ప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు ఏసీసీ తాజా ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. కాగా ఏసీసీ తాజా ప్ర‌క‌ట‌నతో పీసీబీకి పెద్దదెబ్బే త‌గిలింద‌ని చెప్పొచ్చు.‌ తాజాగా టోర్నీని వాయిదా వేయాల‌ని ఏసీసీ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మార్గం మ‌రింత సుగ‌మమ‌యింది. (ఆసియాకప్‌ 2020 వాయిదా : గంగూలీ)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు