పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్‌

21 Oct, 2017 21:13 IST|Sakshi

ఢాకా : ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్‌లో దయాది పాకిస్తాన్‌ను టోర్నీలో రెండోసారి మట్టికరిపించింది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించిన భారత్‌ సెమీస్‌లో కూడా అదే జోరును కొనసాగించింది.  సూపర్‌ ఫోర్‌లో భాగంగా శనివారం జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0తో విజయ ఢంకా మోగించింది.

మ్యాచ్‌ ఇలా..
ఫస్ట్‌ హాఫ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. దీంతో తొలి అర్థభాగంలో రెండు క్వార్టర్లలో ఎవరికీ పాయింట్లు దక్కలేదు. ఈ రెండు క్వార్టర్లలోనూ బంతిని పాకిస్తాన్‌ క్రీడాకారులు ఎక్కువ సమయం తమ అదుపులో ఉంచుకున్నారు. 39వ నిమిషంలో సత్భీర్‌సింగ్‌ అద్భుతంగా గోల్‌ చేసి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు.

దీంతో పాకిస్తాన్‌ ఆటగాళ్లు తడబడ్డారు. గోల్‌ చేయాలన్న ఆలోచనలో తప్పులు మీద తప్పులు చేశారు. దీంతో 41వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ ప్రీత్‌ గోల్‌గా మలచి భారత్‌ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మరు నిమిషమే లలిత్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టి ఇండియాకు మూడో గోల్‌ అందించాడు. 57వ నిమిషంలో గుర్జంత్‌సింగ్‌ గోల్‌ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. కాగా, ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ మలేసియాతో తలపడనుంది.

మరిన్ని వార్తలు