ఇక చావోరేవో

30 Aug, 2013 02:29 IST|Sakshi
ఇక చావోరేవో

ఇపో (మలేసియా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో బెర్త్ దక్కించుకోవాలంటే భారత్ మరో రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఆసియాకప్ హాకీలో విజేతగా నిలిస్తేనే భారత్‌కు ఈ అవకాశం ఉంటుంది. లీగ్ దశలో తిరుగులేని ఆటతీరుతో అదరగొట్టిన భారత్... ఇక సెమీస్, ఫైనల్స్‌లోనూ అదే తరహాలో ఆడితేనే ప్రపంచకప్ అవకాశం దక్కుతుంది.
 
 ఇందులో భాగంగా తొలి పరీక్ష నేడు ఎదురవుతుంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆతిథ్య మలేసియాతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, కొరియాల మధ్య జరుగుతుంది. లీగ్ దశలో భారత్  తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను 8-0తో, దక్షిణ కొరియాను 2-0తో బంగ్లాదేశ్‌పై 9-1తో నెగ్గి పూల్ బిలో టాప్‌గా నిలిచింది. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దారా అండగా ఉండడంతో మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్, ఉతప్ప రాణిస్తున్నారు. అలాగే అంతగా అనుభవం లేని యువ ఫార్వర్డ్‌లైన్ మన్‌దీప్ సింగ్, నితిన్ తిమ్మయ్య, మలక్ సింగ్ కూడా విశేషంగా రాణించడంతో భారత్ విజయాలను సాధించింది. డ్రాగ్ ఫ్లికర్స్ రూపిందర్, రఘునాథ్ బంగ్లా మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు.
 
 
 వీరి జోరుతో నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి తుది పోరుకు అర్హత సాధించాలనే ఆరాటంలో భారత్ ఉంది. మరోవైపు పూల్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియా స్థానిక మద్దతే బలంగా బరిలోకి దిగనుంది. ఊహించని రీతిలో ఆడడం ఈ జట్టు ఆటగాళ్ల లక్షణం. తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలరు. పలు సందర్భాల్లో ఈ జట్టును ఎదుర్కొన్న భారత్‌కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చెలరేగాలని కెప్టెన్ సర్దారా భావిస్తున్నాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు