వీళ్ల సంగతేంటి !

3 Mar, 2016 00:14 IST|Sakshi
వీళ్ల సంగతేంటి !

మ్యాచ్‌లు దక్కని హర్భజన్, నేగి
ఇప్పటి వరకు డగౌట్‌కే పరిమితం
భువనేశ్వర్‌నూ ఆడించట్లేదు
ఇప్పటికైనా అవకాశం ఇస్తారా!

 
సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మూడు సిరీస్‌లుగా భారత జట్టుతో పాటే తిరుగుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో ప్రదర్శన చూసి లంక సిరీస్ నుంచే లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగిని ఎంపిక చేశారు. కానీ అసలు అతను అంతర్జాతీయ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోగలడా అని కనీసం పరీక్షించే ప్రయత్నం చేయలేదు. వీరిద్దరూ ప్రపంచకప్ జట్టులో ఉన్న బౌలర్లు.

కోహ్లి విశ్రాంతితో, ధావన్ గాయంతో రహానే ఆడగలిగాడు గానీ లేదంటే అతనూ ఎక్స్‌ట్రాగానే మిగిలిపోయేవాడు. ఇక రిజర్వ్ ఆటగాడిగా ఉంటూ వస్తున్న భువనేశ్వర్ కూడా డగౌట్‌కే పరిమితమవుతున్నాడు. ప్రపంచకప్‌లోగా షమీ కోలుకోకపోతే అతనికి జట్టులో చోటు దక్కవచ్చు. పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తున్న చోట భువీకి అవకాశం ఇస్తే అతని తాజా ఫామ్ ఏమిటో తెలిసేది.

సాధారణంగా చిన్న జట్లతో మ్యాచ్‌ల్లో కూడా తుది జట్టును మార్చడానికి ధోని పెద్దగా ఇష్టపడడు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ప్రయోగాలపై ఆసక్తి చూపించడు. ఈసారి అతని ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి.

  
 సాక్షి క్రీడా విభాగం
  భారత జట్టు 2016లో ఇప్పటికే తొమ్మిది టి20 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియాలో మొదలైన విజయపరంపర ఒక్క మ్యాచ్ మినహా నిరాటంకంగా సాగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఒక మార్పు తప్ప అదే 11 మందితో టీమిండియా జోరు ప్రదర్శిస్తోంది. విజయాలు సాధిస్తున్న జట్టును మార్చకూడదని క్రికెట్ అనుభవజ్ఞులు చెప్పే మాట. కానీ విశ్వ వేదికపై సవాల్‌కు ముందు అందుబాటులో ఉన్న అన్ని వనరులను పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా చూస్తే కొత్త ఆటగాడు నేగితో పాటు హర్భజన్, భువనేశ్వర్‌ల ఫామ్‌పై కూడా ఒక అంచనాకు రావాలి. ఏదైనా మ్యాచ్‌లో తప్పనిసరిగా బరిలోకి దించాల్సి వస్తే అంతకు ముందు కాస్త మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేకపోతే ఎలా? సుదీర్ఘ సమయం పాటు డగౌట్‌లోనే ఉండిపోవడం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదం కూడా ఉంది.
 
నేగి ఎలా ఆడతాడు?
శ్రీలంకతో సిరీస్‌కు, ఆపై ఆసియా కప్, ప్రపంచకప్‌లకు ఎంపిక కావడం వల్ల పవన్ నేగికి ఏదైనా మంచి జరిగింది అంటే అది ఐపీఎల్‌లో భారీ మొత్తం పలకడమే! అతడికి కేవలం 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవమే ఉన్నా... టి20ల్లో మంచి ప్రదర్శన కారణంగా నేరుగా భారత జట్టులో అవకాశం దక్కింది. లెఫ్టార్మ్ స్పిన్‌తో పాటు చివర్లో ధాటిగా ఆడగల అతని నైపుణ్యం ఐపీఎల్‌లో కనిపించింది. అయితే కనీసం శ్రీలంకతో సిరీస్‌లో అయినా ఆడిస్తే అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం వచ్చేది.

రవీంద్ర జడేజా శైలితో అతనికి సరిగ్గా సరిపోయే ప్రత్యామ్నాయం కాగల ఈ ఆల్‌రౌండర్‌ను కెప్టెన్ పెద్దగా పట్టించుకోలేదు. బౌలింగ్‌లో కచ్చితత్వం ప్రదర్శిస్తున్నా బ్యాట్స్‌మన్‌గా జడేజా ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. నేగిని పరీక్షించి ఉంటే వరల్డ్ కప్ వ్యూహాల్లో అతను కూడా భాగమయ్యేవాడు. రేపు అవసరమై కీలక మ్యాచ్‌లో ఆడించాల్సి వస్తే అలాంటి మెగా టోర్నీలో నేరుగా కొత్త ఆటగాడినుంచి ఎలాంటి ప్రదర్శన ఆశించగలం.
 
సీనియర్ అయినా...
మరో వైపు హర్భజన్ సింగ్‌ది భిన్నమైన పరిస్థితి. భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా అశ్విన్ ఎదిగిన తర్వాత భజ్జీ దాదాపు తెరమరుగైపోయాడు. కోహ్లి అభిమానం వల్ల లంకతో టెస్టు ఆడగలిగినా... టి20ల్లో గత మూడు సిరీస్‌లుగా అతడికి మ్యాచ్ దక్కడం లేదు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ ఆడిన అతని ఆట అక్కడితోనే ఆగిపోయింది. ఎక్కువ మంది లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్ ఉండే శ్రీలంకలాంటి జట్టుతో మ్యాచ్ ఆడినప్పుడు భజ్జీ అవసరం ఉండవచ్చంటూ ధోని చెబుతూ వచ్చినా... ఇప్పటి దాకా అది జరగలేదు. అతని అనుభవాన్ని బట్టి చూస్తే కొత్తగా పరీక్షించేందుకు ఏమీ లేకపోయినా... మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసమైనా ఆడించాల్సింది.
 
రిజర్వ్‌గానే భువి
కొన్నాళ్ల క్రితం వరకు భారత టాప్ పేసర్‌గా ఉన్న భువనేశ్వర్ గతి తప్పి జట్టులో అవకాశం కోల్పోయాడు. ముందుగా ఆసియా కప్ జట్టులో లేకపోయినా షమీ గాయంతో అవకాశం దక్కింది. షమీ ఫిట్‌నెస్ పరిస్థితి చూస్తే ప్రపంచకప్‌లోగా కోలుకుంటాడా అనేది సందేహమే. అదే జరిగితే భువీ కొనసాగే అవకాశం ఉంది. భజ్జీ ఆడిన మ్యాచ్‌లోనే ఆఖరిసారి బరిలోకి దిగిన భువనేశ్వర్ మళ్లీ మైదానంలోకి దిగలేదు. ఇప్పుడు కాస్త రనప్ పెంచడంతో పాటు మరింత ఫిట్‌గా మారిన భువీని...  బంగ్లాదేశ్‌లోని పేస్ పిచ్‌లపై ఒక్క మ్యాచ్ ఆడిస్తే అతని సత్తా తెలిసేది. భారీ హిట్టర్లతో బలంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌లో రహానేకు చోటు దాదాపు అసాధ్యంగా మారింది. పాక్‌తో మ్యాచ్‌లో ఆమిర్ అద్భుత బంతికి అతను వెనుదిరగ్గా, వెంటనే పక్కన పెట్టి ధావన్‌ను మళ్లీ తీసుకున్నారు. అంటే ఎవరైనా గాయపడితే తప్ప రహానేకు చోటు లేదు.
 
 
నేడు యూఏఈతో పోరు
రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

ఆసియా కప్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేడు (గురువారం) భారత్ జట్టు యూఏఈతో తలపడుతుంది. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా, మూడు మ్యాచ్‌లు ఓడిన యూఏఈ  నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించేందుకు భారత్ దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మార్పులైతే ఉంటాయి కానీ ఎంత మందనేది ఇప్పుడే చెప్పలేమని కెప్టెన్ ధోని అన్నాడు. ఈ ఏడాది 9 మ్యాచ్‌లూ ఆడిన నెహ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరో వైపు టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో యూఏఈ బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టు పరాజయం పాలైనా ముగ్గురు ప్రత్యర్థులనూ ఇబ్బంది పెట్టింది. భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లతో యూఏఈని చిత్తు చేసింది.

మరిన్ని వార్తలు