‘పసిడి’ పంట పండించారు

10 Jul, 2017 01:37 IST|Sakshi
‘పసిడి’ పంట పండించారు

చివరి రోజు ఐదు స్వర్ణాలు నెగ్గిన భారత అథ్లెట్స్‌
29 పతకాలతో ఆసియా అథ్లెటిక్స్‌లో అగ్రస్థానం


భువనేశ్వర్‌: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలోనే భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంతో సంతృప్తి పడింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది. ఆఖరి రోజు భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్‌ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్‌ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు.

 పురుషుల, మహిళల 4గీ400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. భారత్‌కే చెందిన పూర్ణిమ (హెప్టాథ్లాన్‌), జాన్సన్‌ (పురుషుల 800 మీటర్లు్ల), దవిందర్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో) కాంస్య పతకాలను కైవసం చేసుకోగా... గోపీ (10 వేల మీటర్లు్ల) రజతం నెగ్గాడు.అర్చనకు నిరాశ: మహిళల 800 మీటర్ల రేసులో భారత అథ్లెట్‌ అర్చన (2ని:05.00 సెకన్లు) విజేతగా నిలిచింది. అయితే తనను వెనక్కినెట్టి అర్చన ముందుకెళ్లిందని శ్రీలంక అథ్లెట్‌ నిమాలి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం నిమాలి ఆరోపణల్లో నిజం ఉందని నిర్వాహకులు తేల్చి అర్చనపై వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు