రిలేలో జోరు

31 Aug, 2018 01:18 IST|Sakshi

వరుసగా ఐదోసారి స్వర్ణం నెగ్గిన మహిళలు

మళ్లీ మెరిసిన హిమాదాస్‌

పురుషుల బృందానికి రజతం

జకార్తా: ఆసియా క్రీడల్లో అద్భుత రికార్డును కొనసాగిస్తూ 4్ఠ400మీ. రిలే పరుగులో భారత మహిళలు వరుసగా ఐదోసారి స్వర్ణం నెగ్గారు. గురువారం జరిగిన రేసులో హిమా దాస్, ఎంఆర్‌ పూవమ్మ, సరితాబెన్‌ గైక్వాడ్, విస్మయ కరోత్‌లతో కూడిన భారత బృందం 3ని. 28.72 సెకన్లలో రేసును పూర్తిచేసి విజేతగా అవతరించింది. హిమా బుల్లెట్‌లా దూసు కెళ్లడంతో ప్రారంభం నుంచి భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. బహ్రెయిన్‌ (3ని. 30.61 సెకన్లు), వియా త్నాం (3ని. 33.23 సెకన్లు) వరుసగా రజతం, కాం స్యాలు సాధించాయి. 2002 ఏషియాడ్‌ నుంచి 4్ఠ400మీ. స్వర్ణం భారత్‌ ఖాతాలోనే ఉంటోంది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో భారత బృందం రజతం గెలుచుకుంది. కున్హు ముహమ్మద్, ధరుణ్‌ అయ్యసామి, మొహమ్మద్‌ అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 01.85 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 3 నిమిషాల 0.56 సెకన్ల ఆసియా క్రీడల రికార్డుతో ఖతర్‌ జట్టు స్వర్ణం దక్కించుకుంది. 3 ని. 1.94 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన జపాన్‌ బృందం కాంస్యం అందుకుంది. గత ఏషియాడ్‌లో భారత పురుషుల రిలే జట్టు నాలుగో స్థానంతో త్రుటిలో పతకాన్ని కోల్పోయింది.

స్క్వాష్‌ సెమీస్‌ ప్రత్యర్థి మలేసియా 
మహిళల స్క్వాష్‌ జట్టు హాంకాంగ్‌ చేతిలో 1–2 తేడాతో పరాజయం పాలైంది. గురువారం జోయ్‌ చాన్‌ 3–1తో దీపికా పల్లికల్‌పై, యానీ 3–0తో జోష్నా చినప్పపై గెలుపొందారు. అయితే... సునయనా కురువిల్లా 3–2 తేడాతో జె లాక్‌ హొపై గెలుపొందింది. గ్రూప్‌ ‘బి’లో మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాంట్లో ఓడిన మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో మలేసియాతో తలపడనుంది.

టీటీ ప్రిక్వార్టర్స్‌లో మనికా, శరత్, సత్యన్‌ 
టేబుల్‌ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మనికా బాత్రా 11–3, 11–7, 11–3, 11–6తో నంథానా కొమ్వాంగ్‌ (థాయ్‌లాండ్‌)ను, పురుషుల విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ 11–4, 11–8, 11–7, 11–5తో ముహమ్మద్‌ ఆసిమ్‌ ఖురేషి (పాకిస్తాన్‌)ని ఓడించారు. సత్యన్‌ జ్ఞాన శేఖరన్‌ 4–2 తేడాతో శాంటొసొపై (ఇండోనేసియా) నెగ్గాడు. 

1500 మీ. పరుగులో చిత్రకు కాంస్యం
మహిళల 1500 మీటర్ల పరుగులో ఆసియా చాంపియన్‌ అయిన చిత్ర ఉన్నికృష్ణన్‌ ఏషియాడ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. 4 నిమిషాల 12.56 సెకన్ల టైమింగ్‌తో  మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే సంతృప్తి పడింది. బహ్రెయిన్‌ అథ్లెట్లు కల్కిదన్‌ బెఫ్కదు (4 ని. 07.88 సెకన్లు), టిగిస్ట్‌ బిలే (4 ని. 09.12 సెకన్లు) స్వర్ణం, రజతం నెగ్గారు. 

మరిన్ని వార్తలు